తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్నికలకు ముందే ప్రాజెక్టులు పూర్తి: నితిన్​ గడ్కరీ - మెగా ఇంజనీరింగ్​కు నితిన్ గడ్కరీ అభినందనలు

శ్రీనగర్‌-లేహ్‌ జాతీయ రహదారిపై చేపట్టిన జడ్‌మోర్‌, జోజిలా సొరంగాల పనులపై కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సమీక్ష నిర్వహించారు. మేఘ ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ చేపట్టిన ఈ ప్రాజెక్ట్​ పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

Nitin Gadkari at Zojila project
సొరంగం పనుల వద్ద నితిన్ గడ్కరీ

By

Published : Sep 29, 2021, 7:01 AM IST

జమ్ము-కశ్మీర్‌ సంపూర్ణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. కశ్మీర్‌ లోయలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. శ్రీనగర్‌-లేహ్‌ జాతీయ రహదారిపై చేపట్టిన జడ్‌మోర్‌, జోజిలా సొరంగాల పనులపై.. కేంద్ర సహాయమంత్రి వీకే సింగ్‌తో కలిసి సమీక్షించారు. అనంతరం గడ్కరీ విలేకరులతో మాట్లాడారు. రహదారుల అభివృద్ధితోనే సామాజిక, ఆర్థిక వికాసం సాధ్యమని.. అందుకే కశ్మీర్‌ లోయలో రూ.లక్ష కోట్లకు పైగా వ్యయమయ్యే 6 ప్రాజెక్టులు చేపట్టామన్నారు. వాటిలో పర్యటక, రక్షణ రంగానికి అవసరమైన కీలక సొరంగాలు ఉన్నాయన్నారు.

కశ్మీర్‌ స్వయం సమృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు గడ్కరీ. మంచు కారణంగా లోయ ప్రాంతంలో ఆరేడు నెలలు రాకపోకలు నిలిచిపోయి.. నిత్యావసర వస్తువులు, పెట్రోలు, డీజిల్‌ దొరకని పరిస్థితి ఉంటోందన్నారు. ప్రజలకు ఉపాధి లేక పేదరికం లో కొట్టుమిట్టాడుతున్నారని మంత్రి చెప్పారు. రహదారి ఏర్పాటుతో పర్యాటక రంగం అభివృద్ధి చెంది, అనేక ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు ఈ ప్రాంతానికి అందుబాటులోకి వస్తాయన్నారు.

పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టిన మేఘ ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌).. జోజిలా సొరంగాన్ని వేగంగా, నాణ్యంగా నిర్మిస్తోందని తెలిపారు. రాజీ పడకుండా పనులు సాగిస్తున్నందుకు ఆ సంస్థ అధినేత కృష్ణారెడ్డిని అభినందించారు. జడ్‌మోర్‌ సొరంగ పనులు జరుగుతున్న తీరుపైనా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇవి కాకుండా... జమ్ములో మొత్తం 32 కిలోమీటర్ల పొడవు ఉండే 20 సొరంగాలను, లద్దాఖ్‌లో మొత్తం 20 కిలోమీటర్ల పొడవున మరో 11 సొరంగాలను నిర్మిస్తున్నట్టు తెలిపారు.

50 ఏళ్ల పనులకు సమానంగా..

"జమ్ము-కశ్మీర్‌లో 50 ఏళ్లపాటు ఎన్ని రహదారి ప్రాజెక్టులు పూర్తయ్యాయో, మోదీ ప్రభుత్వం గత రెండేళ్లలోనే వాటికి సమానమైన పనులను అక్కడ పూర్తిచేసింది. జోజిలా సొరంగ పనులను 2023, డిసెంబరు నాటికి ముగించాలని మేఘ సంస్థను కోరాను. సమయానికి పూర్తయితే, ప్రధాని ఈ సొరంగాన్ని 2024, జనవరి 26న ప్రారంభించే వీలుంటుంది. ఆ ఏడాది సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి.. భాజపా ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులన్నింటిని అప్పటికల్లా పూర్తిచేయాలని భావిస్తున్నాం"

- నితిన్​ గడ్కరీ, కేంద్ర మంత్రి

ఇదీ చదవండి:కేంద్ర మంత్రులతో మోదీ భేటీ- ఆ శాఖల పనితీరుపై ఆరా!

ABOUT THE AUTHOR

...view details