తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జీ23 నేతల ప్రతిపాదనలపై సోనియాతో గులాం ​నబీ ఆజాద్​ భేటీ! - కాంగ్రెస్​ పార్టీ

G23 Congress Leaders: కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో గురువారం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై జీ23 నేతలు బుధవారం నిర్వహించిన సమావేశంలో ప్రతిపాదించిన అంశాలను ఆజాద్​ సోనియాకు వివరించనున్నారు.

g23
సోనియా గాంధీ

By

Published : Mar 17, 2022, 6:37 AM IST

G23 Congress Leaders: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ ఘోర పరాజయం పొందింది. ఇప్పటికే ఆ పార్టీ సీడబ్ల్యూసీ మీటింగ్​ నిర్వహించగా.. బుధవారం జరిగిన జీ23 నేతల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సీనియర్​ నేత గులామ్​ నబీ ఆజాద్​ నివాసంలో జరిగిన ఈ భేటీలో పార్టీ బలోపేతంపై నేతలు తమ ప్రతిపాదనలు సూచించారు. వీటిని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లేందుకు గులామ్​ నబీ ఆజాద్​.. సోనియాతో గురువారం భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాహుల్​-ప్రియాంక గాంధీలు కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

అదొక్కటే మార్గం: జీ23 నేతలు

ఆజాద్​ నివాసంలో సమావేశమైన జీ23 నేతలు.. పార్టీ బలోపేతం కావాలంటే ప్రతి స్థాయిలో సమష్టి, సమ్మిళిత నాయకత్వంతోనే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల్లో భాజపాను గద్దెదించాలంటే కాంగ్రెస్​ విధానాలకు దగ్గరగా ఉండే పార్టీలతో అధిష్ఠానం చర్చలు జరిపి కూటమిని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని పేర్కొన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ మీటింగ్​లో తీసుకున్న నిర్ణయాలు, పార్టీ బలోపేతానికి గల మార్గాలపై నేతలు చర్చించారు.

గాంధీల నాయకత్వ మార్పుపై మౌనం!

అంతకుముందు.. జీ23 నేతల్లో ఒకరైన కపిల్​ సిబల్​ చేసిన వ్యాఖ్యలు పార్టీలో దూమారం రేపాయి. పార్టీ బలోపేతం చెందాలంటే నాయకత్వ బాధ్యతల నుంచి గాంధీ కుటుంబం తప్పుకోవాల్సిందే అని ఆయన చేసిన వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే వంటి సీనియర్​ నేతలు, గాంధీ కుటుంబ మద్దతుదార్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జీ23 నేతల సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే అందుకు భిన్నంగా.. సమావేశంలో ఈ నాయకత్వం మార్పు గురించి ప్రస్తావనే రాకపోవడం గమనార్హం.

ఈ సమావేశంలో కపిల్​ సిబల్​, భూపిందర్​ సింగ్​ హుడా, పృథ్వీరాజ్​ చౌహాన్, మనీశ్​ తివారీ, శశి థరూర్​, రాజ్​ బబ్బర్​, అఖిలేశ్​ ప్రసాద్​ సింగ్, సందీప్​ దీక్షిత్​ వంటి సీనియర్లు పాల్గొన్నారు.

గులామ్​ నబీ ఆజాద్​.. ఈ సమావేశానికి సంబంధించిన పలు వివరాలను సోనియా గాంధీకి ఇప్పటికే ఫోన్లో తెలియజేసినట్లు సమాచారం.

ఇదీ చూడండి :జీ23 వర్గంపై 'గాంధీ' విధేయుల మాటలదాడి.. టార్గెట్ సిబల్!

ABOUT THE AUTHOR

...view details