G20 Summit Modi Speech :ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచంలో ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని కోల్పోయేలా చేసిందని వ్యాఖ్యానించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ పరిస్థితుల్లో మనమందరం పరస్పరం నమ్మకంతో కలిసి ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కొవిడ్ 19లాంటి మహమ్మారిని తరిమికొట్టిన విధంగానే.. యుద్ధంతో ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. 21వ శతాబ్దం చాలా ముఖ్యమైనదని.. పాత సమస్యలకు కొత్త పరిష్కారాలు చాపాలన్నారు. భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దిల్లీలో నిర్వహిస్తున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో ఆతిథ్య దేశాధినేత హోదాలో శనివారం ఉదయం ప్రారంభోపన్యాసం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 'సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్' మంత్రంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. చర్చలు ప్రారంభించే ముందు మొరాకో భూకంపంపై విచారం వ్యక్తం చేశారు. భూకంప మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మొరాకోకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
"జీ20 అధ్యక్ష హోదాలో భారత్ మీకు స్వాగతం పలుకుతోంది. ప్రస్తుతం 21వ శతాబ్దంలో ప్రపంచానికి కొత్త దిశ, దశ సూచించడానికి ఇదే కీలక సమయం. పాత సవాళ్లు ఇప్పుడు కొత్త సమాధానాలు కోరుతున్నాయి. అందుకనే మనం హ్యూమన్ సెంట్రిక్ అప్రోచ్‌తో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో పేద, సంపన్న దేశాల మధ్య భేదాలు, ఇంధనం నిర్వహణ, ఆహారం, హెల్త్, ఎనర్జీ, నీటి భద్రత వంటి సమస్యలకు సమాధానం కోసం ముందుకు వెళ్లాల్సిందే. భారత్ జీ20 అధ్యక్షతన దేశం లోపల, బయట అందరిని కలుపుకొని పోవడానికి ప్రతీకగా నిలిచింది. ఇది ప్రజల జీ20 అనడానికి నిదర్శనంగా మారింది. దేశంలోని 70పైగా నగరాల్లో 200కుపైగా జీ20 సదస్సులు జరిగాయి"
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి