G20 Summit Kharge Rahul : దేశ రాజధాని దిల్లీలో జీ20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందించారు. "ప్రతిపక్ష నేతను ఆహ్వానించకూడదని వారు(కేంద్ర ప్రభుత్వం) ముందే నిర్ణయించుకున్నారు. భారతదేశ జనాభాలో 60 శాతం మందికి నాయకులైన వారిని పట్టించుకోరు. అసలెందుకు వారు అలా చేస్తున్నారో ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాలి" అని రాహుల్ అన్నారు.
'దేశ స్వరూపాన్ని మార్చే ప్రయత్నం..'
దేశంలోని దళితులు, గిరిజనులు, మైనారిటీలు.. దాడికి గురవుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. భారతదేశ స్వరూపాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. అధికారం, సంపద కేంద్రీకృతం కావాలని బీజేపీ కోరుకుంటోందని రాహుల్ దుయ్యబట్టారు. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్.. బ్రస్సెల్స్‌లోని ప్రెస్‌క్లబ్‌లో అంతర్జాతీయ మీడియాతో మాట్లాడారు.
'ఆర్టికల్ 370పై కాంగ్రెస్ వాదన స్పష్టం'
Congress Article 370 : "ఆర్టికల్ 370పై మా వాదన స్పష్టంగా ఉంది. మన దేశంలో ప్రతి ఒక్కరికీ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. అందుకే తమ భావాలను తెలిపేందుకు అందరినీ అనుమతించాలని మేం అనుకుంటున్నాం. కశ్మీర్ అభివృద్ధి చెందాలని మేము కూడా కోరుకుంటున్నాం. అక్కడ శాంతి నెలకొనాలని భావిస్తున్నాం" అని రాహుల్ తెలిపారు.
'హింస విపరీతంగా పెరుగుతోంది..'
Rahul On Democracy :దేశంలో ప్రజాస్వామ్య సంస్థలపై పూర్తిస్థాయి దాడి జరుగుతోందని.. అది అందరికీ తెలుసు అని రాహుల్ అన్నారు. వివక్ష, హింస విపరీతగా పెరుగుతోందని ఆరోపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కేంద్ర ప్రభుత్వ వైఖరితో ప్రతిపక్షాలన్నీ ఏకీభవిస్తున్నాయిని తెలిపారు.