G20 Summit 2023 Kashmir : మే22 నుంచి మూడు రోజుల పాటు జరిగే జీ-20 సమావేశాలు తొలిరోజు అట్టాహాసంగా ముగిశాయి. సోమవారం జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో జరిగిన సదస్సు మొదటిరోజు సమావేశాలకు కేంద్ర పర్యటక శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి, హీరో రామ్‌చరణ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సుస్థిర పర్యాటకం కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని జీ20 దేశాలతో కలిసి సన్నిహితంగా పని చేస్తోందని.. ఇందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్‌రెడ్డి అన్నారు.
కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల కోసం సభ్యదేశాలకు చెందిన 60 మంది విదేశీ ప్రతినిధులు ఇప్పటికే భారత్‌కు చేరుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి సమావేశాలు ఇవే కాగా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను చేసింది ప్రభుత్వం. సదస్సు దృష్ట్యా శ్రీనగర్‌లో పెద్దఎత్తున నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), మెరైన్ కమాండోలతో పాటు పారామిలిటరీ బలగాలను మోహరించారు.
జీ-20 వేదికపై 'నాటు నాటు' సందడి!
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ జీ-20 సమావేశాల్లో సందడి చేశారు. జీ-20 సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన శ్రీనగర్ వెళ్లారు. ఆర్థికాభివృద్ధికి సినిమా పర్యాటకం అనే అంశంపై జరిగిన సదస్సులో రామ్ చరణ్ పాల్గొన్నారు. 1986 నుంచి కశ్మీర్‌కు తరచుగా వస్తున్నానన్న రామ్‌చరణ్ కశ్మీర్‌లో తన తండ్రి చిరంజీవి సినిమాలు ఎక్కువగా షూటింగ్ జరిగేవని గుర్తుచేశారు. గుల్మార్గ్, సోన్ మార్గ్‌లో ఎక్కువ షూటింగ్‌లు జరిగేవని కశ్మీర్ ప్రాంతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. జీ-20 సదస్సు జరుగుతున్న ఇదే ఆడిటోరియంలో 2016లో తన సినిమా షూటింగ్ జరిగిందని చరణ్ గుర్తు చేసుకున్నారు. జపాన్ అంటే తనకెంతో ఇష్టమని అక్కడి ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారని, 'ఆర్‌ఆర్‌ఆర్' కోసం ఆ దేశంలో పర్యటించామని తెలిపారు.
G20కి చైనా డుమ్మా
కాగా, ఈ జీ-20 సదస్సులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, భారత్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, బ్రిటన్ సహా ప్రపంచంలోని ఇరవై ప్రధాన దేశాలు ఉన్నాయి. అయితే తాజాగా జరిగిన సదస్సు సమావేశాలకు చైనాతో పాటు మరికొన్ని దేశాలు హాజరుకాలేదు. సమస్యాత్మక కశ్మీర్‌లో అంతర్జాతీయ స్థాయి సమావేశాలను నిర్వహించడంపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.