G20 Summit 2023 Delhi :భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు అట్టహాసంగా ముగిసింది. ఈనెల 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్ల పరిష్కారం కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన ఆవశ్యకతను సభ్యదేశాలన్నీ అంగీకరించాయి. భారత్ అధ్యక్షతన జరిగిన సమావేశాల నిర్వహణ, తీసుకున్న నిర్ణయాలపై సభ్య దేశాలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాయి. జీ20 డిక్లరేషన్‌పై సభ్యదేశాల నుంచి ఏకాభిప్రాయం సాధించటం ద్వారా భారత్ అతి పెద్ద విజయాన్ని అందుకుంది.
G20 Modi News :జీ20 సమావేశాల ముగింపుసందర్భంగా తదుపరి జీ20 అధ్యక్ష బాధ్యతలను ప్రధాని మోదీ బ్రెజిల్‌కు అప్పగించారు. ఈ మేరకు గావెల్‌గా పేర్కొనే చిన్న సుత్తిని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వాకు అందించారు. అనంతరం సదస్సు తీర్మానాలను ప్రధాని మోదీ ప్రకటించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తుకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌పై జరుగుతున్న కృషికి జీ20 వేదిక కావటం ఎంతో సంతృప్తినిచ్చిన్నట్లు.. ముగింపు ప్రసంగంలో ప్రధాని మోదీ తెలిపారు. పలు కీలకాంశాలపై కూడా జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో చర్చించినట్లు చెప్పారు. ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై ప్రగతి వేగాన్ని సమీక్షించేందుకు నవంబర్ చివరలో జీ20 వర్చువల్ భేటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.
"మీరందరూ అనేక అంశాలు ప్రస్తావించారు. సలహాలు ఇచ్చారు. ఇంకా చాలా ప్రతిపాదనలు పెట్టారు.సభ్యదేశాల నుంచి వచ్చిన సలహాలపై దృష్టి సారించి, వాటి ప్రగతిలో వేగం ఎలా తేవచ్చో చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. నవంబర్ చివరలో జీ20 వర్చువల్ భేటీ ఏర్పాటు చేయటానికి ప్రతిపాదిస్తున్నా. ఈ సదస్సులోని అంశాలపై సమీక్షించవచ్చు. అందులో మీరందరూ కలుస్తారని ఆశిస్తున్నా. ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు రోడ్‌మ్యాప్ సుఖాంతం కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఆశ, శాంతి పరిఢవిల్లాలి.
--నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ప్రధాని నరేంద్రమోదీ.. ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల అంశాన్ని జీ20 సదస్సు వేదిక నుంచి మరోసారి లేవనెత్తారు. ఐరాసలో సభ్య దేశాల సంఖ్య పెరిగినా కూడా భద్రతా మండలిలోని శాశ్వతసభ్య దేశాల సంఖ్యలో మాత్రం మార్పు లేదన్నారు. జీ20 సదస్సులో వన్ ఫ్యూచర్ అంశంపై మాట్లాడిన ప్రధాని మోదీ.. ప్రపంచ వర్తమాన పరిస్థితులను అంతర్జాతీయ నూతన నిర్మాణం ప్రతిబింబించాలని సూచించారు. 51 సభ్య దేశాలతో ఐరాస ఏర్పాటైనప్పుడు ప్రపంచం భిన్నంగా ఉండేదని, ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 2వందలకు చేరిన విషయాన్ని ప్రస్తావించారు. ఎవరైనా సమయానికి అనుకూలంగా మారకపోతే.. వారు తమ ప్రాముఖ్యతను కోల్పోవటం సహజమని ప్రధాని మోదీ గుర్తుచేశారు.
వర్తమాన, భవిష్యత్తు ప్రపంచంపై ప్రభావం చూపే బర్నింగ్ అంశాల్లో సైబర్ సెక్యూరిటీ, క్రిప్టో కరెన్సీ ఒకటని ప్రధాని మోదీ అన్నారు. క్రిప్టో కరెన్సీ సామాజిక క్రమానికి, ద్రవ్య, ఆర్థిక స్థిరత్వానికి కొత్త అంశమని, దాన్ని నియంత్రించేందుకు ప్రపంచస్థాయి ప్రమాణాలు ఆవశ్యకతను గుర్తు చేశారు. టెర్రర్ ఫండింగ్‌కు సైబర్ స్పేస్ సరికొత్త వనరుగా మారిందని, దాన్నుంచి రక్షణ పొందేందుకు ప్రపంచ సహకారం, ఫ్రేమ్‌వర్క్ తప్పనిసరి అని గుర్తు చేశారు. ప్రతి దేశ భద్రతకు, శ్రేయస్సుకు ఇది చాలా ముఖ్యమైన అంశమని ప్రధాని మోదీ తెలిపారు.