G20 Summit 2023 Delhi India :భారత్ అధ్యక్షతన దిల్లీ వేదికగా శనివారం, ఆదివారం జరగనున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్రం.. దీని ద్వారా భారత సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాలని సంకల్పించుకుంది. దిల్లీలోని ప్రగతి మైదానంలో రెండురోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థలకు సవాళ్లు విసిరే పరిణామాలు ఉన్న ప్రస్తుత సమయంలో ఈ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జీ20 సదస్సుకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. తొలిసారి ఈ సదస్సును భారత్ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఎక్కడా రాజీ పడకుండా అన్ని ఏర్పాట్లు చేసింది కేంద్రం. దిల్లీ నగరాన్ని శత్రుదుర్భేద్యంగా మార్చేసింది.
G20 Bharat Mandapam Pragati Maidan :దిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సుకు వచ్చే ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అందుకు వేదికైన భారత మండపం ముస్తాబైంది. భారత దేశ విభిన్న సంస్కృతిని తెలిపేలా.. ఒక జిల్లా, ఒకే ఉత్పత్తి కార్యక్రమం కింద తయారు చేసిన హస్తకళలు, కళాఖండాలతో ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారత్ సాధించిన పురోగతిని తెలిపేలా చిత్రాలను ప్రదర్శనలో ఉంచారు. దేశంలో ప్రజాస్వామ్యం పరిణామం చెందిన తీరును ప్రదర్శించే స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. కశ్మీర్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని భదోహి నుంచి తెప్పించిన ప్రత్యేక తివాచీలను ప్రదర్శనలో ఉంచారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల వారసత్వ సంపద, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటేలా వేదిక సిద్ధం చేశారు.
మహాత్ముడి స్ఫూర్తితో..
PM Modi Message Before G20 Summit :మానవ కేంద్రీకృత, సమ్మిళిత అభివృద్ధికి ఈ జీ20 సమావేశం సరికొత్త మార్గాన్ని చూపుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అణగారిన వర్గాలకు, సమాజంలోని ప్రతి వ్యక్తికీ సేవలందించాలన్న మహాత్మా గాంధీ ఆశయం ఇందులో ఉంటుందన్నారు. భారత జీ20 ప్రెసిడెన్సీ.. కార్యాచరణే లక్ష్యంగా సాగిందని గుర్తు చేశారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి వేగం పెంచాల్సిన అవసరం ఉందని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
కీలక అంశంపై విజయం!
India G20 African Union :ఈ సమావేశంలో జీ20 విస్తరణ దాదాపు ఖాయమైంది. ఆఫ్రికా సమాఖ్యకు జీ20 సభ్యత్వం ఇవ్వడానికి అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. కాకపోతే ఆఫ్రికా యూనియన్ చేరిక తర్వాత జీ20 గ్రూపు పేరును జీ-21గా మారుస్తారా లేదా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై ప్రకటన వెలువడితే జీ-20లో పేద దేశాలకు ప్రాతినిధ్యం ఇచ్చినట్లవుతుంది. భారత్ అధ్యక్షతన ఈ గ్రూపుపై చెరగని ముద్ర వేసినట్లవుతుంది.
సంయుక్త ప్రకటన ఉంటుందా?
G20 Declaration 2023 India :అయితే, శిఖరాగ్ర సదస్సు అనంతరం సంయుక్త ప్రకటన ఉంటుందా లేదా అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ప్రధాన సమస్యలపై ఇప్పటికీ సభ్య దేశాల మధ్య సయోధ్య కుదరలేదు. పాశ్చాత్త దేశాలకు, రష్యా- చైనాలకు మధ్య ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో సంయుక్త ప్రకటన వెలువడటంపై సందేహాలు నెలకొన్నాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై బలంగా స్పందించాలని పశ్చిమ దేశాలు భావిస్తున్నాయి. అయితే, ఆర్థిక విషయాలపై కాకుండా.. జీ20 సదస్సులో వాటిని ఎందుకు ప్రస్తావిస్తారని రష్యా, చైనా వాదిస్తున్నాయి.
డిక్లరేషన్ సిద్ధం: కేంద్రం
కాగా.. డిక్లరేషన్ దాదాపు సిద్ధమైందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఏకాభిప్రాయం కోసం చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ అంశాలపై జీ20 అగ్రనేతల వ్యక్తిగత ప్రతినిధులు గురువారం మధ్యాహ్నం వరకు చర్చలు జరిపారు. తర్వాత ప్రధాన వేదిక వద్ద డిక్లరేషన్‌పై చర్చలు జరపనున్నారు. డిక్లరేషన్‌లోని పేరా-6పై ప్రధానంగా గొడవ జరుగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఖండిస్తూ ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రస్తావించాలని ఒకవర్గం పట్టుపడుతుండగా.. మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పర్యావరణ మార్పుల అంశంపైనా సయోధ్య కుదరలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో 55 మంది సభ్యులతో కూడిన ఆఫ్రికా యూనియన్ చేరికపైనే రష్యా, చైనా సహా అన్ని దేశాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సంయుక్త ప్రకటన ఎలా ఉంటుందనేది తేలాల్సి ఉంది. సంయుక్త ప్రకటన వెలువడకపోతే.. సదస్సుకు సంబంధించిన సారాంశ ప్రకటనను విడుదల చేస్తారు.