G20 Security Delhi : లక్షా 30 వేల మంది భద్రతా సిబ్బంది... యుద్ధ విమానాలు... రాడార్లు... బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు... వందలాది డ్రోన్లు... వేలాది సీసీ కెమెరాలు... కఠిన ఆంక్షలు... డేగ కళ్లు...ఏంటి ఇదేమైనా యుద్ధానికి సన్నాహకమా అనుకుంటున్నారు కదూ! కాదు. జీ 20 సదస్సు జరగనున్న వేళ దేశ రాజధాని దిల్లీలో ( G20 Delhi Closed ) కనివినీ ఎరుగని పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. చీమ చిటుకుమన్నా పసిగట్టేలా ఆకాశంలో అనుమానాస్పదంగా ఏది కనిపించినా వెంటనే నేలమట్టం చేసేలా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది భద్రతా సిబ్బంది, వేలాది సీసీ కెమెరాలు, వందలాది డ్రోన్లు, పదుల సంఖ్యలో యుద్ధ విమానాలను మోహరించారు. క్షిపణి రక్షణ వ్యవస్థలను సైతం హైఅలర్ట్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ప్రపంచ దేశాధినేతలు తరలిరానున్న వేళ వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ కేంద్రం ఈ మేరకు ఏర్పాట్లు చేసింది.
జీ20 సదస్సు జరగనున్న వేళ వాహన రాకపోకలు సహా అనేక ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు దేశ రాజధానిలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలపై నిషేధం విధించారు. క్లౌడ్ కిచెన్, ఫుడ్ డెలివరీ, అమెజాన్ డెలివరీ సహా ఎలాంటి ఆన్‌లైన్ డెలివరీలను అనుమతి లేదని దిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ సురేందర్‌యాదవ్ తెలిపారు. అయితే దిల్లీలో లాక్‌డౌన్ ( G20 Delhi Lockdown) విధిస్తారన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 10 అర్ధరాత్రి వరకు దిల్లీలోకి వాహనాల ప్రవేశంపై నిషేధం ఉంటుందని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు.
మెట్రో సేవలు ఇలా...
Delhi G20 Metro Services :మరోవైపు జీ20 సమ్మిట్ సందర్భంగా మెట్రోసేవలు నిలిపేస్తారన్న ఊహగానాలను దిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ కొట్టిపారేశారు. కేవలం సుప్రీంకోర్టు స్టేషన్‌లో మాత్రమే మెట్రో సేవలు ప్రభావితం అవుతాయని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు స్టేషన్ తప్ప మిగతా అన్ని స్టేషన్లలో మెట్రో సేవలు సాధారణంగానే కొనసాగుతాయని... కొన్ని మెట్రో స్టేషన్లలో మాత్రం భద్రతా నిబంధనల ప్రకారం 10 నుంచి 15 నిమిషాల వరకు ప్రవేశం, నిష్క్రమణ ద్వారాలను మూసివేయవచ్చని తెలిపారు.