G20 President Dinner : భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు దిల్లీకి చేరుకున్న దేశాధినేతలతోపాటు అతిథులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. సదస్సు ప్రధాన వేదిక ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో శనివారం రాత్రి జరిగిన ఈ విందుకు విదేశీ అతిథులతో పాటు దేశంలోని పలువురు నేతలు హాజరయ్యారు. దేశాధినేతలకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ.. స్వయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేదిక బ్యాక్‌గ్రౌండ్‌లో 'నలంద విశ్వవిద్యాలయం' చిత్రాన్ని ఉంచారు.
G20 President Dinner Guest List : రాష్ట్రపతి ముర్ము ఏర్పాటు చేసిన విందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతులు, మారిషస్ ప్రధాని దంపతులు, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోస దంపతులు, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా దంపతులు, ఆస్ట్రేలియా ఆంథోనీ ఆల్బనీస్ దంపతులు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ సహా పలువురు దేశాధినేతలు హాజరయ్యారు.
G20 Dinner Guest List : ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగ దంపతులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్, ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ సహా పలువురు ప్రముఖులు.. రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందుకు విచ్చేశారు. గాలా డిన్నర్లో భాగంగా ప్రపంచ అగ్రనేతలు, అతిథులు.. భారతీయ వంటకాలను రుచి చూశారు.
మెనూ ఇదే..
G20 Dinner Menu 2023 : విందులో భాగంగా అతిథులకు బంగారు, వెండి పాత్రల్లో ఆహార పదార్ధాలను వడ్డించారు. చిరుధాన్యాలు, పనసపండుతో చేసిన గాలెట్టె (బ్రెడ్ వంటి ఫ్రెంచి వంటకం), గ్లేజ్‌డ్ ఫారెస్ట్ మష్రూమ్, చిరుధాన్యాల వంటకాలు, కేరళ రెడ్‌రైస్, వివిధ రకాల బ్రెడ్‌లతోపాటు ముంబయి పావ్ కూడా అందించారు. డెజర్ట్‌లో యాలకులు, ఊదలతో చేసిన మధురిమ అనే పుడ్డింగ్, ఫిగ్ పీచ్ కంపోట్, ఆంబేమొహార్ క్రిస్పీస్, పాలు-గోధుమలతో చేసిన నట్స్ ఉన్నాయి. పానీయాల్లో కశ్మీరీ ఖావా, ఫిల్టర్ కాఫీ, డార్జిలింగ్ టీ, పాన్ ఫ్లేవర్డ్ చాక్లెట్ ఏర్పాటు చేశారు.