G20 Leaders Staying Hotels : జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్‌కు విచ్చేస్తున్న దేశాధినేతల కోసం దిల్లీలో ఖరీదైన హోటళ్లు ముస్తాబయ్యాయి. రెండోసారి భారత్‌కు వస్తున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ నాలుగు రోజులు భారత్‌లో పర్యటించనున్నారు. హోటల్ ఐటీసీ మౌర్యలో బైడెన్‌కు వసతి కల్పించారు. శుక్రవారం భారత్‌కు రానున్న బైడెన్... ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. శని, ఆదివారాల్లో జీ20 అధికారిక సమావేశాల్లో పాల్గొని వాతావరణ మార్పులు, శుద్ధ ఇంధనం అంశాలపై చర్చించనున్నారు.
షాంగ్రి లా హోటల్‌లో సునాక్..
Where Are G20 Leaders Staying : బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తొలిసారి ప్రధాని హోదాలో భారత్‌కు వస్తున్నారు. ఆయనకు షాంగ్రి లా హోటల్‌లో బస చేసేందుకు వసతి కల్పించారు. ఏషియన్ సదస్సులో పాల్గొని నేరుగా భారత్‌కు వస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోస్.. ది లలిత్ హోటల్‌లో బస చేయనున్నారు. జపాన్ ప్రధాని పుమియో కిషిదా కూడా ఇక్కడే ఉంటారని సమాచారం. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ఇంపీరియల్ హోటల్‌లో బస చేస్తారు. 3 దేశాల పర్యటనలో ఉన్న ఆయన ఇండొనేషియా, ఫిలిప్పీన్స్ తర్వాత భారత్‌కు వస్తారు.
క్లారిడ్జెస్‌లో ఫ్రెంచ్ అధ్యక్షుడు..
దిల్లీలోని మరో ప్రముఖ హోటల్ క్లారిడ్జెస్‌లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ ఉంటారు. డాక్టర్ జాకిర్ హుస్సేన్ మార్గ్‌లో ఉన్న ఒబెరాయ్ హోటల్‌ను తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ బస కోసం బుక్ చేశారు. గురుగ్రామ్ ఒబెరాయ్ హోటల్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఉంటారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ గైర్హాజరవుతున్న వేళ.. ఆ దేశ ప్రతినిధిగా వస్తున్న విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా ఒబెరాయ్‌లోనే ఉంటారని సమాచారం.
తాజ్ హోటల్‌లో చైనా ప్రధాని..
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు బదులుగా వస్తున్న ఆ దేశ ప్రధాని లీ చియాంగ్ బృందం కోసం తాజ్ హోటల్‌లో వసతి ఏర్పాట్లు చేశారు. ఇటలీ అధ్యక్షుడి రాకపై సందగ్ధం ఉన్నా ఆ దేశ ప్రతినిధులు JW మారియట్ అండ్ హయత్ రీజెన్సీలో ఉండనున్నారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ వస్తారని అధికారిక ప్రకటన లేదు అయితే ఆ దేశ ప్రతినిధులు లీలా హోటల్‌లో ఉండేందుకు ఏర్పాట్లు చేశారు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి దిల్లీ..
Delhi G20 Summit Security : సెప్టెంబర్ 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు జీ-20 సదస్సు జరగనున్న నేపథ్యంలో దిల్లీ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులతోపాటు కేంద్ర బలగాలు నగరాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ట్రాఫిక్, శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు సుమారు 40 వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. కర్తవ్యపథ్, ఇండియా గేట్ లాంటి కీలక ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నిషేధించారు.
దిల్లీలో భద్రతా చర్యల్లో భాగంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ -DRDO అభివృద్ధి చేసిన కౌంటర్-డ్రోన్ సిస్టమ్‌ను అధికారులు తీసుకొచ్చారు. ఎటువంటి డ్రోన్ దాడులనైనా తిప్పికొట్టేందుకు ఇది ఉపయోగపడనుందని తెలిపారు. ఆకాశ మార్గాన ఎదురయ్యే దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆర్మీతో పాటు, ఇతర సివిల్ ఏజెన్సీల డ్రోన్ వ్యవస్థలు కూడా నిరంతరంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.
జీ-20 నేతల రక్షణలో భాగంగా పేలుడు పదార్థాలను గుర్తించేందుకు యాంటీ-సాబోటేజ్ డ్రిల్స్‌ను భద్రతా దళాలు నిర్వహించాయి. డమ్మీ బంబులపై పోలీసు జాగిలాలతో డ్రిల్స్ చేశాయి. నగరంలోని ప్రతీ ప్రాంతంపై నిఘా కోసం దిల్లీ మున్సిపల్ కౌన్సిల్ -NDMC ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. అటు యమునా నది సహా సమీప ప్రాంతాల్లోనూ పోలీసులు.. భద్రతను ముమ్మరం చేశారు. పడవల ద్వారా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.