G20 Dinner Invite :జీ-20 సదస్సును పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. శనివారం ఏర్పాటు చేసిన విందుకు విదేశీ అతిథులు, పార్లమెంటేరియన్లు, కేబినెట్‌లోని మంత్రులతోపాటు పలువురు మాజీ ప్రధానులు హాజరుకానున్నారు. మాజీ ప్రధానులు దేవెగౌడ, మన్మోహన్ సింగ్‌కు ఆహ్వానాలు పంపినట్లు అధికారవర్గాలు తెలిపాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానం అందలేదని ఆయన కార్యాలయం ప్రకటించింది.
విందుకు దేవెగౌడ దూరం..
రాష్ట్రపతి ఇచ్చే విందుకు హాజరుకాట్లేదని తెలిపారు మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ. అనారోగ్య కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. జీ20 సదస్సు విజయవంతం కావాలని ఆశిస్తూ.. 'ఎక్స్'లో ఆయన ఓ పోస్ట్ చేశారు. మరోవైపు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. రాష్ట్రపతి విందుకు హాజరుకానున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం మధ్యాహ్నం బంగాల్ నుంచి ఆమె దిల్లీకి బయలుదేరి వెళతారని పేర్కొన్నాయి. విందుతో పాటుగా దిల్లీలో వివిధ పార్టీ నేతలతో మమతా భేటీ అవుతారని సమాచారం. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీతీశ్ కుమార్, హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్.. తాము ఈ విందుకు హాజరవుతున్నట్లు తెలిపారు. దిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత మండపంలో ఈ విందు కార్యక్రమం జరగనుంది. దీంతోపాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు సైతం జరగనున్నాయి.