G20 Declaration India : దిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సు సందర్భంగా భారత్ దౌత్యపరంగా మరో విజయం సాధించింది. శిఖరాగ్ర సమావేశాల ముగింపు సందర్భంగా విడుదల చేసే సంయుక్త డిక్లరేషన్‌పై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించింది. సంయుక్త డిక్లరేషన్‌పై జీ20 దేశాల ఏకాభిప్రాయం కుదిరినట్లు సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రకటించారు. డిక్లరేషన్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు కృషి చేసిన జీ20 షెర్పాలు, మంత్రులు, అధికారులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.
అయితే దిల్లీ జీ20 సమావేశాల సంయుక్త డిక్లరేషన్.. దృఢమైన, స్థిరమైన, సమతుల్యమైన వృద్ధి కోసం కృషి చేస్తుందని భారత జీ20 షెర్పా అమితాబ్ కాంత్ ట్వీట్ చేశారు. 21వ శతాబ్దానికి చెందిన బహుపాక్షిక సంస్థల పురోగతిని వేగవంతం చేయడంపై దృష్టి పెడుతుందని తెలిపారు. అన్ని రంగాల అభివృద్ధితోపాటు భౌగోళిక- రాజకీయ సమస్యలపై 100% ఏకాభిప్రాయంతో కూడిన సంయుక్త డిక్లరేషన్ ఇది అని తెలిపారు.
ఉక్రెయిన్ పేరాగ్రాఫ్ మార్పుతో..
శనివారం ఉదయం.. సంయుక్త డిక్లరేషన్‌లో ఉక్రెయిన్ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ సవరించిన పేరాగ్రాఫ్‌ను జీ20దేశాల ప్రతినిధులకు పంపిణీ చేసినట్లు దౌత్యవర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించిన పేరాగ్రాఫ్‌పై ఏకాభిప్రాయం రాకపోవటంవల్ల సానుకూల ఫలితం రాబట్టేందుకు భౌగోళిక రాజకీయ అంశానికి చెందిన పేరా లేకుండా ముసాయిదా శిఖరాగ్ర ప్రకటనను పంపిణీ చేసినట్లు చెప్పాయి. దీంతో కొత్త పేరాగ్రాఫ్‌తో ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉందని భారత్ ఆశించినట్లే జరిగింది.
మార్నింగ్ సెషన్ వీడియోను ట్వీట్ చేసిన మోదీ
G20 Modi Video : దిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సు తొలిరోజు మార్నింగ్ సెషన్ విశేషాలను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దిల్లీ జీ20 సదస్సులో ఫలప్రదమైన ఉదయం అంటూ వీడియో ట్వీట్ చేశారు.
శనివారం ఉదయం దిల్లీకి పలువులు దేశాధినేతలు
G20 Leaders Arrival :రెండు రోజులపాటు జరుగుతున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, జర్మనీ ఛాన్స్లర్ ఓలాఫ్ స్కోల్జ్, సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్.. శనివారం ఉదయం దిల్లీకి చేరుకున్నారు.