కాంగ్రెస్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కపిల్ సిబల్ (Kapil Sibal news) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్టీ కార్యకర్తలు ఆయన ఇంటి ముందు నిరసన చేయడాన్ని జీ23 నేతలు(G23 Leaders) గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ ఖండించారు. ఇది ప్రణాళికా ప్రకారం చేసిన గూండాయిజమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"ఆయన(సిబల్) నమ్మకమైన కాంగ్రెస్‌వాది. పార్లమెంట్ బయట, లోపల పార్టీ కోసం పోరాడారు. సలహాలు ఎలాంటి వర్గం నుంచి వచ్చినా వాటిని అణచివేయకుండా, స్వీకరించాలి. గూండాయిజం ఆమోదయోగ్యం కాదు."
-గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ సీనియర్ నేత
ప్రజాస్వామ్యంలో అభిప్రాయభేదాలు సహజమేనని జీ23 నేతల్లో ఒకరైన ఆనంద్ శర్మ (Anand sharma) పేర్కొన్నారు. హింస, అసహనం కాంగ్రెస్ సంస్కృతికి వ్యతిరేకమని చెప్పారు. ఇలాంటి దుర్భరమైన ఘటనలు పార్టీకి అప్రతిష్ఠను తీసుకొస్తాయని ట్వీట్ చేశారు. వీటిని ఖండించాలని అన్నారు. 'భావప్రకటనా హక్కును పరిరక్షించిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. ఈ ఘటనకు కారకులైనవారిని గుర్తించి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi news) ఘటనను తీవ్రంగా పరిగణించాలి' అని పేర్కొన్నారు.
'సీనియర్లు పార్టీకి కీలకం'
మరోవైపు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సైతం కార్యకర్తల నిరసనను ఖండించారు. 'పార్టీ నాయకత్వానికి సంతృప్తికరం కాని అభిప్రాయాలు చెప్పినందుకే.. సిబల్ ఇంటిపై దాడి జరిగింది' అని చెప్పుకొచ్చారు.
"సీనియర్ నేతలను పూర్తిగా విస్మరించడం దురదృష్టకరం. ఇలా చేయడం పార్టీకే మంచిది కాదు. సీనియర్ నేతలు ఆలోచనాపరులు. పార్టీ భవిష్యత్‌కు వారు కీలకం. వ్యూహాలు రూపొందించేందుకు సీనియర్ నేతలను ఉపయోగించుకోవాలి. యువ నాయకత్వానికి వాటిని అమలు చేసే బాధ్యత అప్పగించాలి."