G 20 Summit 2023 :భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 సదస్సు శనివారం ప్రారంభం కానుంది. అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన దిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ఈ సదస్సు జరగనుంది. సదస్సుకు భారత్.. కనీవినీ ఎరుగని ఏర్పాటు చేసింది. అతిథులకు ఘన స్వాగతం నుంచి సదస్సు విజయవంతం అయ్యేవరకూ ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూస్తోంది. జీ20 సభ్యదేశాలతోపాటు.. బంగ్లాదేశ్, ఈజిప్టు, మారిషస్, యూఏఈ, స్పెయిన్, సింగపూర్, ఒమన్, నైజీరియా, నెదర్లాండ్స్‌ను కూడా సదస్సు కోసం భారత్ ఆహ్వానించింది. జీ20 సదస్సులో పాల్గొనే అతిరథుల్లో చాలా మంది ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. తొలుత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్... తన సతీమణి అక్షతా మూర్తితో కలిసి భారత్‌లో అడుగుపెట్టారు. సునాక్‌కు కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే స్వాగతం పలికారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం సాయంత్రం భారత్‌లో అడుగుపెట్టారు. ఆయన కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు. బైడెన్ సతీమణి జిల్ బైడెన్‌కు కొవిడ్ సోకడం వల్ల ఆయన ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దిల్లీ చేరుకున్నారు. ప్రపంచ నేతలకు విమానాశ్రయం వద్ద సంప్రదాయ నృత్యాలతో స్వాగతం లభించింది. ఐఎంఎఫ్ అధినేత క్రిస్టాలినా జార్జీవా తనకు స్వాగతం పలికిన వారితో కలిసి డ్యాన్స్ చేశారు.
చైనా ప్రధాని లీ కియాంగ్, సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడొ దిల్లీ చేరుకున్నారు. ఇటలీ ప్రధాని మెలోని, అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్, ఆఫ్రికన్ యూనియన్ ఛైర్ పర్సన్ అజాలీ అస్సౌమని కూడా తరలివచ్చారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్, ఒమన్ ఉప ప్రధాని ఒమన్ సయ్యిద్ ఫహద్ బిన్ మహమ్మద్ అల్ సయ్యద్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా కూడా భారత్ చేరుకున్నారు.