Funny leave application : అలిగి, పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను బుజ్జగించి, తిరిగి తీసుకొచ్చేందుకు సెలవు కావాలని కోరాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. తాను ఎంతటి 'క్లిష్ట' పరిస్థితుల్లో ఉన్నానో వివరిస్తూ ఉన్నతాధికారికి లేఖ రాశాడు. వెంటనే ఈ వెరైటీ లీవ్ లెటర్ వైరల్ అయింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో జరిగింది.
'భార్య నాపై అలిగింది.. 3 రోజులు లీవ్ ఇవ్వండి ప్లీజ్'.. క్లర్క్ లెటర్ వైరల్ - funny leave message
Funny leave letter to boss: సెలవు కోసం ఓ ప్రభుత్వ ఉద్యోగి రాసిన లేఖ నెట్టింట వైరల్ అయింది. అలకపాన్పు ఎక్కిన భార్యను బుజ్జగించేందుకు సెలవు ఇవ్వాలని ఆ లేఖలో కోరడమే ఇందుకు కారణం.
షమ్షాద్ అహ్మద్.. ఉత్తర్‌ప్రదేశ్ బేసిక్ శిక్షా అధికారి-బీఎస్ఏ ఉద్యోగి. కాన్పుర్‌లోని ప్రేమ్ నగర్ శాఖలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. సెలవు కోసం మంగళవారం తన పైఅధికారికి లేఖ రాశాడు అహ్మద్. "ప్రేమ విషయంలో నా భార్యతో చిన్న గొడవ జరిగింది. ఆమె అలిగింది. కుమార్తెను, ఇద్దరు కుమారుల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అందుకే నా మానసిక పరిస్థితి ఏమీ బాగాలేదు. ఆమెను బుజ్జగించి, పుట్టింటి నుంచి తిరిగి తీసుకొచ్చేందుకు నేను ఊరు వెళ్లాల్సి ఉంది. అందుకోసం ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు అత్యవసర సెలవు, నగరం విడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను" అని లేఖలో పేర్కొన్నాడు అహ్మద్.
కాస్త విచిత్రంగా ఉన్న ఈ లేఖ.. కాసేపటికే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ తెగ షేర్ చేస్తున్నారు. ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చినట్లు జిల్లా బీఎస్ఏ అధికారి సుర్జీత్ సింగ్ చెప్పారు. ప్రేమ్ నగర్ శాఖ అధికారిని నివేదిక అడిగామని, వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.