Neera Cafe in Hyderabad :నీరా .. ఈ పానీయాన్ని సేవించాలంటే గతంలో పల్లెటూళ్లకు వెళ్లేవారు. కానీ.. ఇప్పుడా అవసరం లేదు. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర తీరాన ప్రభుత్వం నీరా కేఫ్‌ను ఏర్పాటు చేసింది. రూ.13 కోట్ల వ్యయంతో అత్యంత ఆకర్షణీయంగా పల్లె వాతావరణం ఉట్టిపడేలా అందుబాటులోకి తెచ్చారు. ఈ కేఫ్ చూస్తే.. గ్రామీణ ప్రాంతంలోనే నీరాను సేవిస్తున్న అనుభూతిని కలిగిస్తుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. వారాంతాల్లో కుటుంబసభ్యులతో కలిసి సరదాగా వచ్చి సందడి చేస్తున్నారు.
గుర్తింపు పొందిన ప్రయోగశాల విమ్‌టా ల్యాబ్స్‌లో జరిపిన విశ్లేషణ ఆధారంగా.. నీరాలో జీవశక్తి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్.. విటమిన్ ఎ, ఇ, డీ2, కే.బీ2, బీ6, బీ12, సీ విటమిన్లు ఉంటాయి. కొలెస్ట్రాల్ జీరోశాతం ఉంటుంది. నీరా అనుబంధ పదార్థాలను.. కేఫ్‌లో విక్రయిస్తున్నారు. తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరాను మరిగించి తాటి, ఈత బెల్లం తయారు చేస్తారు. తాటి, ఈత సిరప్, తేనే, తాటి చక్కెర వంటివి ఇక్కడ అమ్ముతున్నారు. నగరవాసులు వీటన్నింటి రుచులు ఆస్వాదిస్తున్నారు.
కల్లు ప్రథమ రూపమే నీరా : కల్లు వేరు, నీరా వేరు.. కల్లు ప్రథమ రూపమే నీరా అని కేఫ్ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. ఆల్కహాల్ లేని సహజసిద్ధమైన పానీయం అంటున్నారు. 300 ఎం.ఎల్ నీరాను రూ.90 విక్రయిస్తున్నారు. 150 ఎం.ఎల్ నీరాను గ్లాసుల్లో విక్రయిస్తున్నారు. ఇందుకు 50 రూపాయలు తీసుకుంటున్నారు. ఒకేసారి 500ల మంది కూర్చునేలా.. పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
600 నుంచి 700లీటర్ల వరకు విక్రయాలు :రోజూ సుమారు 600 నుంచి 700లీటర్ల వరకు విక్రయాలు జరుగుతున్నాయని.. నిర్వాహకులు తెలిపారు. 7 స్టాళ్లతో పాటు పార్శిల్ తీసుకెళ్లే వారికోసం.. ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. నీరా కేఫ్ నుంచి ట్యాంక్‌బండ్‌లోని బుద్ధ విగ్రహం వరకు.. బోటింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్లు బోటింగ్ చేసేందకు వీలుగా ఏర్పాట్లు చేశారు.