Arvind Kejriwal: వేర్పాటువాది అంటూ కాంగ్రెస్, భాజపా చేస్తున్న వ్యాఖ్యలను మరోసారి తిప్పికొట్టారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. దేశంలోని అవినీతిపరులంతా తనపై ఉగ్రవాది ముద్ర వేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో 'స్మార్ట్ క్లాస్‌రూం'ల ప్రారంభోత్సవానికి హాజరైన కేజ్రీవాల్ భాజపా, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. ఈ ఉగ్రవాదే నేడు 12,430 స్మార్ట్ క్లాస్‌రూంలను దేశానికి అంకితమిచ్చాడు అని వ్యాఖ్యానించారు.
'అవినీతిపరులంతా కలిసి నన్ను ఉగ్రవాది అంటున్నారు. ఎవరినైతే వారు ఉగ్రవాది అంటున్నారో ఆ వ్యక్తే నేడు 12,430 స్మార్ట్ క్లాస్‌రూంలను దేశానికి అంకితమిచ్చాడు. ఇప్పుడు అధికారుల పిల్లలతో పాటు రిక్షా డ్రైవర్లు, కార్మికుల సంతానం కూడా ఒకే డెస్క్‌లో కూర్చుని చదువుకుంటారు. బాబా సాహెబ్ అంబేడ్కర్, భగత్‌సింగ్ కలలను నెరవేరుస్తున్నా' అంటూ వ్యాఖ్యానించారు.
వేర్పాటువాద వ్యాఖ్యలు చేశానంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆప్ అధినేత శుక్రవారమే కొట్టిపారేశారు. ఆ ఆరోపణలు హాస్యాస్పదం అన్నారు. అదే నిజమైతే, తనపై చర్యలు ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. 'నేను ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన ఉగ్రవాదిని. పాఠశాలలు, ఆసుపత్రులు, విద్యుత్, రహదారులు, నీరు అందించే ఉగ్రవాదిని. దేశ విభజనకు కుట్రపన్నుతున్నానని, దేశంలోని ఒక భాగానికి ప్రధాని అవ్వాలనుకుంటున్నానని వారు అంటున్నారు. ఈ లెక్కన నేను పెద్ద ఉగ్రవాదినే. అప్పుడు వారి భద్రతా సంస్థలు ఏం చేస్తున్నాయి? దేశంలోని పెద్ద పార్టీలు దేశ భద్రతను అపహాస్యం చేస్తున్నాయి' అని అన్నారు.
కేజ్రీవాల్ ఒక స్వతంత్ర దేశానికి ప్రధాని కావాలనుకుంటున్నారని, ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్నారని ఇటీవల ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వ్యాఖ్యలు చేసింది ఆప్ వ్యవస్థాపక సభ్యుడు కుమార్ విశ్వాస్. అయితే ఆయన ఇప్పుడు ఆప్ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. విశ్వాస్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కేజ్రీవాల్‌పై భాజపా, కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేశాయి. ఆప్ అధినేతను ఉగ్రవాది, వేర్పాటువాది అని పేర్కొన్నాయి.
ఇదీ చూడండి:Punjab polls: పంజాబ్ ఎన్నికలకు సర్వం సిద్ధం.. గెలుపుపై పార్టీల ధీమా