ఇంధన ధరల పెరుగుదలపై బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ స్పందించకుంటే.. వారి సినిమా ప్రదర్శనలను మహారాష్ట్రలో నిలిపివేస్తామని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే హెచ్చరించారు. వారి సినిమా షూటింగ్లను అనుమతించబోమని తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో చమురు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా గళమెత్తిన సదరు నటులు.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
"మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు పెరిగినప్పుడు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ వంటి నటులు ట్వీట్ల ద్వారా విమర్శలు చేశారు. మరి ఇప్పుడు పెట్రో ధరలు పెరిగినప్పుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు. దీనిపై వారు స్పందించకుంటే వారి సినిమాలు, షూటింగ్లను మహారాష్ట్రలో అనుమతించం. ఇప్పుడు కూడా వారు ఆ విధంగానే.. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసన తెలపాలి."
--నానా పటోలే, మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్