టూల్ కిట్ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల దిశ రవిని దిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం శనివారం అరెస్టు చేసింది. ఆమెకు కోర్టు 5 రోజుల కస్టడీ విధించింది. టూల్ కిట్ వల్లే జనవరి 26న రైతుల ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిందన్నది పోలీసుల వాదన.
ఏమిటా టూల్ కిట్?
సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో 3 నెలలుగా అన్నదాతలు ఉద్యమిస్తున్నారు. వారికి మద్దతుగా నిలిచారు పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ట్విట్టర్లో ఓ టూల్ కిట్‌ను పోస్టు చేశారు.
టూల్ కిట్‌లో ఏముంది?
రైతుల ఉద్యమానికి అండగా నిలబడాలని అనుకునేవారికి కార్యాచరణ ప్రణాళికే టూల్ కిట్. రైతులకు మద్దతుగా ట్విట్టర్లో పోస్టులు, ప్రజా ప్రతినిధులకు వినతులు, ఆర్థిక సహాయం, అంబానీ, అదానీ సంస్థల ఉత్పత్తుల బహిష్కరణ, క్షేత్రస్థాయిలో(ప్రభుత్వ కార్యాలయాలు, భారత రాయబార కార్యాలయాలు, మీడియా సంస్థల) వద్ద నిరసన వంటివి చేయాలని పిలుపునిచ్చారు. దాంతో పాటే మరిన్ని వివరాల కోసం కొన్ని లింకులను పొందుపరిచారు.
దిశ రవి ఎవరు? టూల్ కిట్‌తో సంబంధమేంటి?
దిశ రవి.. బెంగళూరుకు చెందిన 21ఏళ్ల పర్యావరణ ఉద్యమకారిణి. భారత్‌లో వాతావరణ సంక్షోభంపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నారు. పర్యావరణ మార్పులపై వార్తా పత్రికల్లో వ్యాసాలు రాస్తుంటారు. ఆమె సొంతూరు సోలదేవనహళ్లి. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాల నుంచి డిగ్రీ తీసుకున్నారు. 'ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్' అనే సంస్థ సహ వ్యవస్థాపకురాలు దిశ.