Friendship Day Special: మనతో రక్త సంబంధం లేదు.. బంధువు కాదు. ఇంట్లో వ్యక్తి కాదు.. అవసరం వస్తే మాత్రం వెంటనే గుర్తొస్తాడు. ఏంటో చెప్పు నేనున్నానంటూ భుజంపై చేయి వేస్తాడు. ఎక్కడో పుడతాడు.. ఎక్కడో పెరుగుతాడు.. అసలు సంబంధమే లేని వ్యక్తి.. అయినా జీవితంలో ప్రతి చోట నీతోనే ఉంటాడు.. వాడే ఫ్రెండ్. స్నేహం.. ఎక్కడ మెుదలవుతుందో తెలియదు. ఎందుకూ అనే ప్రశ్నే రాదు. కష్టమొస్తే.. కన్నీరు తుడుస్తాడు. సంతోషమొస్తే పంచుకుంటాడు. అమ్మా, నాన్న, అక్కా, చెల్లి, తమ్ముడు.. ఇలా అన్ని బంధాలను దేవుడే ఇచ్చినా.. స్నేహితుడిని మాత్రం నువ్వే ఎంచుకోమని పంపిస్తాడు.
బంధాలకందని భావం... అన్నింటా తోడుండే ధైర్యం... ప్రతీ ఒక్కరూ ఒక పుస్తకం... అందరూ కలిస్తే.. అదో అద్భుత లోకం... ఎన్నో మధురానుభూతుల సమాహారం... స్నేహం గురించి చెప్పాలంటే... ఎద లోతుల్లో ఎన్నో జ్ఞాపకాలు... పెదవులపై చిరునవ్వులు... జీవితంలో ఇంకెన్నో మజిలీలు... ఒక్కో దశలో ఏర్పడే మైత్రి బంధాలను గుర్తు చేస్తూ... ఈ స్నేహితుల దినోత్సవం రోజు కొన్ని చిలిపి గురుతులు..
వాకిట్లో గోళీలాట నుంచి గల్లీలో క్రికెట్దాకా..
బలపం ముక్కల నుంచి బాధలు పంచుకునేదాకా..
పడిపోయినప్పుడు ఇచ్చే ఆసరా నుంచి సాధించినప్పుడు పొందే ప్రశంస దాకా...
శక్తిమాన్ సీరియల్ నుంచి మల్టీప్లెక్స్ సినిమా దాకా...
కాకెంగిలి చేసిచ్చిన చాక్లెట్ నుంచి కార్పొరేట్ ఉద్యోగం ఇప్పించే దాకా...
వేలు పట్టుకుని బడికి వెళ్లినప్పటి నుంచి కట్టె పట్టుకుని నడిచేవరకు..
కష్టమొస్తే... కన్నీరు తానై... నీలో ధైర్యాన్ని నింపుతూ...
సంతోషంలో... చిరునవ్వు తానై... నీకన్నా ఎక్కువ ఆనందిస్తూ... నీ ఆనందాన్ని ఆస్వాదిస్తూ...
అవసరమైన ప్రతీసారి తోడు నీడగా ఉండే... కొండత అండే స్నేహం... ఆటపట్టించే ఆకతాయిగా ...
మందలించే గురువుగా... అక్కున చేర్చుకునే ఆత్మీయుడిగా...
బాధలో ఓదార్చే అమ్మగా... విజయంలో గర్వించే నాన్నగా... ఆత్మస్థైర్యాన్ని నింపే తోబుట్టువుగా...
అన్ని బంధాలకు అతీతమైన అద్భుత అనుభూతి ఈ మైత్రి... !!!