Omicron variant India: ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తూనే ఉంది. కొత్తకొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ.. ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. మనిషి రోగనిరోధక శక్తికి పరీక్ష పెడుతూ.. దశలవారీగా ఉత్పరివర్తన చెందిన వైరస్.. అరకోటి మందికిపైగా పొట్టన పెట్టుకుంది. తాజాగా దక్షిణాఫ్రికాలో బయటపడిన ఒమిక్రాన్.. భారత్‌కు కూడా వ్యాపించింది. దీంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. ఈ క్రమంలో ఎన్నో అనుమానాలు.. ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాంటి సందేహాలను నివృతి చేసేందుకు ప్రయత్నించింది కేంద్ర ప్రభుత్వం.
ఏంటీ ఒమిక్రాన్ వేరియంట్? ఎందుకు అంత భయం?
What is omicron variant: దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్‌ను బి.1.1.529గా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వేరియంట్ చాలా అసాధారణమైన వైరస్ ఉత్పరివర్తనాల కలయిక అని తెలిపారు. ఇది రోగనిరోధక శక్తిని ఏమార్చి.. విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీనికి వ్యాక్సిన్ల నుంచి తప్పించుకోగల లేదా డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉంటే.. పెను ముప్పుగా మారవచ్చు.
ప్రస్తుతమున్న టెస్టింగ్ పద్ధతులు ఒమిక్రాన్‌ను గుర్తించగలవా?
కరోనా నిర్ధరణకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమైన పద్ధతి ఆర్టీ-పీసీఆర్. ఈ విధానంతో వైరస్‌లోని నిర్దిష్ట జన్యువులైన స్పైక్(ఎస్), ఎన్వలప్డ్(ఈ) న్యూక్లియోకాప్సిడ్(ఎన్) సహా పలు జన్యువులను గుర్తించవచ్చు. దీని ద్వారా వైరస్ ఉనికిని నిర్ధరించవచ్చు. అయితే కొన్నిసార్లు ఎస్ జన్యువు లేనట్లు (ఎస్ జీన్ డ్రాప్ అవుట్) ఫలితాలు వచ్చే అవకాశముంది. ఎస్ జీన్ అనేది మిగతా వైరల్ జీన్స్‌పైన పరిశోధన చేస్తుంటే బయటపడింది. ఇది ఒమిక్రాన్‌పై పరిశోధనకు ఉపయోగపడుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ తుది నిర్ధరణకు జెనోమిక్ సీక్వెన్సింగ్ అవసరం.
ఎంత జాగ్రత్తగా ఉండాలి?
ఒమిక్రాన్‌ను 'ప్రపంచస్థాయి ఆందోళన కలిగించే వైరస్ రూపాంతరం'గా(వేరియంట్ ఆఫ్ కన్సర్న్) డబ్యూహెచ్ఓ ప్రకటించింది. ఈ వేరియంట్‌కు రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే సామర్థ్యం, వేగంగా వ్యాపించే లక్షణం, ఒమిక్రాన్‌లోని స్పైక్ ప్రోటీన్ విపరీతంగా పరివర్తన చెందడం, రీఇన్ఫెక్షన్ల కారణంగా భవిష్యత్తులో కేసులు పెరిగే అవకాశం ఉండటం సహా పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా పేర్కొంది. ఈ వేరియంట్‌పై ప్రస్తుత కరోనా టీకాలు ప్రభావంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి కొత్త వేరియంట్ పట్ల జాగ్రత్తగా మసులుకోవాలి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కరోనా మొదటి రెండు దశల్లో తీసుకున్న జాగ్రత్తలే ఇప్పుడూ తప్పక పాటించాలి. ముక్కు, మూతిని కప్పేలా సరిగ్గా మాస్క్ ధరించడం, వ్యాక్సినేషన్(ఒకవేళ తీసుకోకపోతే), భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలి.