భారత్‌తో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం(rafale deal corruption) కుదిరేలా చూసేందుకు.. దసో ఏవియేషన్ సంస్థ భారీగా ముడుపులు ఇచ్చిందంటూ ఫ్రాన్స్‌కు చెందిన 'మీడియాపార్ట్' జర్నల్ సంచలన వార్త ప్రచురించింది(rafale deal news). ఇందుకోసం బోగస్ ఇన్వాయిస్లు రూపొందించిందని వెల్లడించింది. దసో ఏవియేషన్.. ఓ మధ్యవర్తికి 7.5మిలియన్ యూరోల(రూ. 64.32కోట్లు) ముడుపులను రహస్యంగా అందించేందుకు ఈ ఇన్వాయిస్లు ఉపయోగపడ్డాయని ఆరోపించింది. 36 రఫేల్ యుద్ధ విమానాల కోసం కుదిరిన రూ. 59వేల కోట్ల ఒప్పందంలో అవకతవకలు జరిగాయా? అనే అంశంపై దర్యాప్తు చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం జులైలో ఓ న్యాయమూర్తిని నియమించిందని పేర్కొంది మీడియాపార్ట్.
బోగస్ ఇన్వాయిస్కు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ, భారత దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టలేదని మీడియాపార్ట్ ఆరోపించింది.
"భారత్‌తో రఫేల్ ఒప్పందం కుదిరేలా చూసేందుకు.. దసో ఏవియేషన్ ఓ మధ్యవర్తికి 7.5మిలియన్ యూరోలు ముడుపులు చెల్లించింది. వీటి కోసం బోగస్ ఇన్వాయిస్లను రూపొందించారు. ఆ మధ్యవర్తి పేరు సుశేన్ గుప్తా. భారత్‌లోని సీబీఐ, ఈడీలోని కొందరికి ఈ విషయం తెలుసు. 2018 అక్టోబర్‌లోనే వారికి ఆధారాలు లభించాయి. కానీ ఈ విషయంలో ముందుకెళ్లాలని వారు భావించలేదు."