Freebies Supreme Court :రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు.. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్లకు ఉచితాలు పంపిణీ చేస్తున్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిల్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ పిల్‌పై రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తమ అభిప్రాయం తెలియజేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. పన్ను చెల్లింపుదారుల సొమ్మును రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో భట్టూలాల్ జైన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌పై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో కేంద్రం, ఎన్నికల సంఘం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది.
'ప్రభుత్వం ఎన్నికలకు ముందు నగదు పంపిణీ చేయడం కంటే దారుణం మరొకటి ఉండదు. ఇది ప్రతిసారీ జరుగుతోంది. చివరకు ఈ భారం పన్ను చెల్లింపుదారులపై పడుతుంది' అని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.
Freebies in India: కొన్నాళ్ల క్రితం ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచితాలను వ్యతిరేకిస్తూ.. దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించింది. రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు తీవ్రమైన అంశమని.. దీనిపై చర్చ జరగాల్సిందేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించింది. ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయబోతున్నాయని తెలిపింది. రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చేంత వరకు ఉచిత వాగ్దానాలు ఆగబోవని స్పష్టం చేసింది. ఉచితాలు తీవ్రమైన అంశమని.. అందులో ఎలాంటి సందేహం లేదని ధర్మాసనం తెలిపింది. కేంద్రప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించింది. పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది వికాస్‌సింగ్.. ఉచితాలపై ఏర్పాటు చేసే కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చైర్మన్‌గా.. ఉండాలని కోరారు. దీనిపై స్పందించిన సీజేఐ.. పదవీ విరమణ చేసిన వ్యక్తికి.. పదవీ విరమణ చేయబోయే వ్యక్తికి ఈ దేశంలో విలువ ఉండదని అదే సమస్యని వ్యాఖ్యానించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.