రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో ఉచిత హామీలు సర్వసాధారణంగా మారిన వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. పార్టీలు ఇచ్చే ఉచిత తాయిలాలకు అయ్యే ఖర్చు, దాని అమలు సాధ్యాసాధ్యాలపై ఓటర్లకు ప్రామాణికమైన సమాచారాన్ని అందించాలని ఆదేశించింది. ఈ మేరకు దేశంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ లేఖ రాసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల జాబితా, వాటిని ఎలా నెరవేరుస్తారు, అందుకు ఉన్న ఆర్థిక వనరులు ఏంటో పార్టీలు స్పష్టంగా ఓటర్లకు తెలియజేయాలని లేఖలో ఈసీ సూచించింది.
ఉచిత హామీల అమలుపై తగినంత స్పష్టత లేకపోతే అది ఆర్థిక సుస్థిరతను దెబ్బతీసే ప్రమాదాన్ని కొట్టిపారేయాలేమని ఈసీ అభిప్రాయపడింది. ఉచిత హామీలకు సంబంధించి అనుసరించాల్సిన ఒక ఉమ్మడి ఫార్మాట్‌ను ఈసీ.. పార్టీలకు పంపింది. అలాగే 2015 ఎన్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దానాలు, వాటిని నెరవేర్చిన వివరాలు అందించాలని ఈసీ కోరింది. వాటిపై ఈనెల 19 లోపు సమాధానం ఇవ్వాలని రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బలోపేతం చేయడానికి.. రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమని ఈసీ ఈ సందర్భంగా అభిప్రాయపడింది.