Free Smartphone Tablets UP: మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. రాష్ట్రంలో కోటిమంది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నట్టు తెలిపింది. మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయీ జయంతి రోజున (డిసెంబర్ 25న) వీటి పంపిణీ తొలి దశను ప్రారంభించనున్నారు. ఆ రోజు లక్ష స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లను లఖ్‌నవూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్టు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో యువతకు లాప్‌టాప్‌లు కూడా ఇవ్వలేదని, ఆయనకు కూడా ఇప్పటికీ ల్యాప్‌టాప్ ఎలా వాడాలో కూడా తెలియదంటూ ఇటీవల రాయ్‌బరేలీలో నిర్వహించిన సభలో సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. అలాగే, గతంలో తాము పంపిణీ చేసిన ల్యాప్‌టాప్‌లు ఇప్పటికీ పనిచేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో యోగి ప్రభుత్వం ఏకంగా కోటి మందికి స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించడం గమనార్హం.
ఎవరెవరికి ఇస్తారు?
రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థినులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోజున 60వేల స్మార్ట్‌ఫోన్లు, 40వేల ట్యాబ్‌లను యువతకు పంపిణీ చేస్తారని తెలిపారు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా వీటిని పంపిణీ చేస్తున్నట్టు పేర్కొన్నారు.