Free Smartphone Tablets UP: రాష్ట్రంలోని కోటి మంది విద్యార్థులకు ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లు ఉచితంగా అందించే కార్యక్రమానికి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శ్రీకారం చుట్టారు. తొలివిడతలో భాగంగా 60వేల మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లను శనివారం పంపిణీ చేశారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతిని పురస్కరించుకుని లఖ్‌నవూలోని ఇకానా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో వీటిని విద్యార్థులకు అందజేశారు.
Up free smartphone yojana: ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. యువత నిరాశవాదాన్ని వీడాలని, విశాలంగా ఆలోచించాలని ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు.
"మన ఆలోచనలు ఎప్పడూ పరిమితంగా ఉండొద్దు. విశాలంగా ఆలోచించడం వల్ల.. మన వ్యక్తిత్వంలో కొత్త కోణం ఆవిష్కృతమవుతుంది. యువత తమ జీవితాల్లోకి నిరాశను దరిచేరనీయవద్దు. అమితాసక్తితో పని చేస్తే.. తాము ఏదనుకుంటే అది సాధించగలరు.''
-యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి.
Up free tablet yojana: రాష్ట్రంలో కోటిమంది ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లను పంపిణీ చేయనున్నట్టు ఇటీవల యూపీ ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో భాగంగా శనివారం స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు అందజేసింది. వీటిని అందుకున్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సహా తదితురులు హాజరయ్యారు.