గత లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రభావం ఈసారి తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కనిపించబోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తమిళనాడు ఎన్నికల్లో భాజపా బాధ్యులు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి పనులు చూసి అన్నాడీఎంకే కూటమికి ప్రజలు ఈసారి విజయాన్ని అందిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ కూటమికి రానున్న శాసనసభ ఎన్నికల్లో విజయావకాశాలు మెరుగ్గా ఉన్నట్లు సర్వేల ద్వారా తెలిసిందన్నారు. చెన్నైలో గురువారం ఆయన 'ఈనాడు-ఈటీవీ' ప్రతినిధితో ముచ్చటించారు.
2019 ఎన్నికల నాటి పరిస్థితులు వేరు!
2019 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమికి ఒక స్థానం మాత్రమే లభించింది. ఆ ఎన్నికలకు కొద్దికాలం ముందు మాత్రమే ముఖ్యమంత్రిగా పళనిస్వామి పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీనివల్ల ఆయన ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు సమయం అవసరమైంది. గత రెండేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి పళనిస్వామి అభివృద్ధి పనుల ద్వారా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా, ప్రజలకు సత్వరం వైద్యం అందేలా పళనిస్వామి తగిన చర్యలు తీసుకున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనించేలా చేస్తున్నారు. నీటి ఎద్దడి సమస్య పరిష్కరించారు. అందరి అంచనాలు తలకిందులు చేసి, పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థంగా నడుపుతున్నారు. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే-భాజపా మధ్య కుదిరిన పొత్తు వల్ల రెండు పార్టీలూ ప్రయోజనం పొందుతాయి. ప్రచారం ఇప్పటివరకు ప్రాథమిక దశలోనే ఉంది. ఇకపై పుంజుకుంటుంది. ఈ నెల 30న ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారు.
శశి ప్రకటన వెనుక మా ప్రమేయం లేదు
జయలలిత నెచ్చలి శశికళ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటానని చేసిన ప్రకటన వెనుక భాజపా ప్రమేయం ఎంత మాత్రం లేదు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం మా పార్టీకి లేదు. ఇక్కడ ప్రభుత్వం కూలకూడదని, మధ్యంతర ఎన్నికలు రాకూడదనే భావనతో వారికి, అభివృద్ధి పథకాల వంటి వాటికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది. అన్నాడీఎంకేను గెలిపించాలని శశికళ నేరుగా చెప్పకున్నా డీఎంకే అధికారంలోకి రాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం వంద సంవత్సరాలు కొనసాగాలన్నారు కదా!
అవసరాల మేరకు పార్టీల నిర్ణయాలు