Free Medical Treatment To Road Accident Victims :రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ బాధితులకు ఉచిత, నగదు రహిత వైద్యం అందించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది! దేశమంతటా ఈ విధానాన్ని మూడు, నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఓ సీనియర్ ఉన్నతాధికారి వెల్లడించారు.
దిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ (IRTE) నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన రోడ్డు రవాణా శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ఈ విషయాన్ని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు భారత్లో జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. "మోటరు వాహన చట్టం 2019 సవరణ(MVA 2019) ప్రకారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు ప్రభుత్వం.. ఉచిత, నగదు రహిత వైద్యం అందించాలి. దీన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేశాయి. ఇప్పడు దేశవ్యాప్తంగా ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖతో కలిసి రోడ్ రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అమలు చేయనుంది" అని అనురాగ్ జైన్ తెలిపారు.