Free IIT coaching in Bihar: రూ.లక్షల్లో ఖర్చయ్యే ఐఐటీ కోచింగ్‌ను.. ఎన్నో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా అందిస్తోంది బిహార్ గయాలోని పట్వాటోలీ కోచింగ్ సెంటర్. ఇక్కడ చదువుకొని వెళ్లిన ఎందరో ఐఐటియన్లే ప్రస్తుతం దీనిని నిర్వహిస్తున్నారు. వారితో పాటు దేశవిదేశాల్లోని ఇంజినీర్లు కూడా బోధన, ఆర్థిక చేయూతను అందిస్తున్నారు. పేద విద్యార్థులు తమ కలలను నిజం చేసుకోవడంలో అండగా నిలుస్తున్నారు. డబ్బులు లేని కారణంగా ఎవరూ చదువుకు దూరం కాకూడదనే ఉన్నత లక్ష్యంతో ఈ కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు చంద్రకాంత్ పాటేకర్.
"చదువుకోవడానికి వనరులు లేని విద్యార్థులకు మేము సహాయం చేస్తాం. ఈ కార్యక్రమం 2013లో ప్రారంభమైంది. ఆ సమయంలో మా స్నేహితుడు ఐఐటీలో చదవాలనుకొని.. డబ్బులు లేకపోవడం వల్ల ఆగిపోయాడు. కానీ మా దగ్గర తగినంత ఆర్థిక శక్తి ఉన్నప్పుడు.. డబ్బుల కారణంగా ఎవరూ చదువుకు దూరం కాకూడదని అప్పుడు నిర్ణయించుకున్నాం. అందుకే ఈ కోచింగ్ సెంటర్ ప్రారంభించాం."
-చంద్రకాంత్ పాటేకర్, పట్వాటోలీ స్థాపకుడు
ఈ సంస్థలో 'వృక్ష' అనే గ్రంథాలయం కూడా ఉంది. ఇక్కడ విద్యార్థులకు పుస్తకాలు ఉచితంగా ఇస్తారు. ప్రస్తుతం విదేశాల్లో, భారత్‌లోని బ్లూచిప్ కంపెనీల్లో పనిచేస్తున్న ఇంజినీర్ల ఆర్థిక సహకారంతో ఈ కోచింగ్ సెంటర్లోని లైబ్రరీని నిర్వహిస్తున్నారు. గతేడాది ఎనిమిది మంది విద్యార్థులు పట్వాటోలీ నుంచి ఐఐటీ సాధించగా, మొత్తంగా సుమారు 150 మంది అభ్యర్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణలైనట్లు చంద్రకాంత్ తెలిపారు.