కూటి కోసమే కోటివిద్యలు అంటారు. ప్రతి జీవికీ ఆకలే ప్రధాన సమస్య. పనిచేసి, డబ్బు సంపాదించుకోలేని వాళ్లు కడుపు నింపుకునేందుకే యాచకులుగా మారతారు. ప్రస్తుతం ప్రతిచోటా యాచకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కష్టపడి పని చేసుకోగలిగిన వాళ్లు కూడా భిక్షమెత్తుకోవడం కనిపిస్తోంది. వీళ్ల వల్ల ఏ పనీ చేయలేక యాచకులుగా మారినవారికీ, దివ్యాంగులకూ సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఆహారం దొరక్క అల్లాడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంతో వచ్చింది బెల్గాంకు చెందిన ఓ యువబృందం.
ఇంజినీరుగా పనిచేస్తున్న బెల్గాంకు చెందిన ఆర్బీ మాలి.. ఆకలితో అలమటిస్తున్నవారి కడుపు నింపేందుకు కృషి చేస్తున్నాడు. డీఎఫ్ ఫౌండేషన్ స్థాపించి.. 20 మంది యువకులతో చేతులు కలిపాడు. యాచకులు ఉచిత భోజనం అందించే కార్డులు అందిస్తున్నాడు. హోటల్ అసోసియేషన్ సైతం మాలి చేస్తున్న మంచిపనికి పూర్తి సహకారం అందిస్తున్నారు.
"ఆకలితో బాధపడుతున్న వారికి హోటళ్ల నుంచి ఉచితంగా ఆహారం అందించేలా డియర్ హుడ్‌ఫుడ్ కార్డులు అందిస్తోంది డీఎఫ్ ఫౌండేషన్. చేతికి డబ్బులివ్వడమో, ఆహార పొట్లాలు అందించడం కంటే ఈ పని చేయడం ఉత్తమమని అనిపించి, ఏర్పాట్లు చేశాం."
- ఆర్బీ మాలి, డీఎఫ్ ఫౌండేషన్ సీఈఓ
డియర్ హుడ్‌ఫుడ్ కార్డులు.. ఏటీఎం కార్డుల్లానే ఉంటాయి. హోటళ్లలో ఉచిత భోజనం కోసం వీటిని నగరంలోని ఏ పనీ చేయలేని యాచకులు, వృద్ధులకు పంపిణీ చేశారు. ఒక్కో కార్డు ధర 10 రూపాయలు. ఈ కార్డు ఉన్నవారెవరైనా.. ఆయా హోటళ్లకు వెళ్లి, అల్పాహారం, స్నాక్స్ ఉచితంగా పొందవచ్చు. రెండు డియర్ హుడ్‌ఫుడ్ కార్డులు ఇచ్చి, భోజనం తెచ్చుకోవచ్చు.