వర్క్ ఫ్రమ్ హోం పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఓ ముఠా గుట్టురట్టు చేశారు హరియాణా పోలీసులు. ఓ మహిళ ఫేస్బుక్లో పెట్టిన వర్క్ ఫ్రమ్ హోం ప్రకటనను నమ్మి.. రూ.1,27,000 మోసపోయింది. దీంతో బాధిత మహిళ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. దిల్లీలో కాల్‌సెంటర్ నిర్వహిస్తున్న ఆ ముఠాలోని ఇద్దర్ని అరెస్ట్ చేశారు.
వర్క్ ఫ్రమ్ హోం అంటూ ఘరానా మోసం.. వలలో పడిన మహిళ.. ఇద్దరు అరెస్ట్
నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో పనిచేసుకుంటూ సులువుగా డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారు. కొవిడ్ రాకతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్ ఫ్రం హోమ్ అవకాశాన్ని కల్పించాయి. దీంతో చాలా మంది ఇంట్లో కూర్చొని ఎంచక్కా పని చేసుకుంటున్నారు. అయితే కొందరు సైబర్ మోసగాళ్లు దీన్ని అవకాశంగా మార్చుకొని అమాయకులను మోసం చేస్తున్నారు. హరియాణాలో ఇదే తరహా మోసం వెలుగుచూసింది. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు ఘరానా మోసానికి పాల్పడుతున్న ఓ బృందాన్ని అరెస్ట్ చేశారు.
ఫరీదాబాద్‌కు చెందిన ఓ మహిళ కొన్నిరోజుల క్రితం ఫేస్బుక్లో ఓ ప్రకటన చూసింది. అందులో ఇంట్లో కూర్చొని పనిచేస్తూ సులువుగా ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చని ఉంది. దీన్ని నమ్మిన సదరు మహిళ అందులో ఉన్న వాట్సాప్ నంబర్‌కు ఫోన్ చేసింది. దీంతో తమ వలలో పడిందని గ్రహించిన మోసగాళ్లు.. ఆమెకు మరిన్ని ఆశలు కల్పించారు. దీనికోసం ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు, ఈసీఎస్ చార్జీ, జీఎస్టీ, కొరియర్ చార్జీ, ఇన్సూరెన్స్ పేరుతో మళ్లీ మళ్లీ డబ్బులు వసూలు చేశారు. ఆ తర్వాత వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల ఆ మహిళ మోసపోయినట్లు గ్రహించి.. ఫరీదాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వెంటనే సైబర్ అధికారి బసంత్ నేతృత్వంలో ఓ బృందం రంగంలోకి దిగింది. సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ముఠా దిల్లీలోని రోహిణి ప్రాంతం నుంచి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారు ఓ కాల్ సెంటర్ పేరుతో ఈ మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఆ కాల్ సెంటర్‌పై దాడులు చేసిన సైబర్ బృందం.. ప్రధాన నిందితుడు ప్రభాత్, ఓం ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు బిహార్ వాసులుగా గుర్తించారు. వారి నుంచి 14 మొబైల్ ఫోన్లు, 13 సిమ్ కార్డులు, రూ.64,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రమేయమున్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.