నాలుగుసార్లు టీకా తీసుకున్న ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. 12 రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన బాధితురాలు.. తిరిగి అదే దేశానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆమెకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ విమానాశ్రయంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
"30 ఏళ్ల మహిళ.. వివిధ దేశాల్లో నాలుగు సార్లు టీకా అందుకున్నారు. అయినప్పటికీ విమానాశ్రయంలో జరిపిన కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అంతకుముందు రోజు జరిపిన పరీక్షల్లో ఆమెకు కరోనా నెగిటివ్‌గా రిపోర్టు వచ్చింది" అని ఇందోర్ వైద్యాధికారులు వెల్లడించారు.