Four Suspected Terrorists Arrested: భారత్‌పై ఎప్పుడూ విషం చిమ్ముతుండే పాకిస్థాన్ తలపెట్టిన మరో భారీ కుట్రను హరియాణా పోలీసులు భగ్నం చేశారు. గురువారం ఉదయం నలుగురు అనుమానిత ఉగ్రవాదులను కర్నాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున బుల్లెట్లు, గన్‌పౌడర్ కంటైనర్‌లను స్వాధీనం చేసుకున్నారు. మధుబన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే అసలు బాగోతం బయటపడింది.
పోలీసుల కథనం ప్రకారం.. నిందితులు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులతో టచ్‌లో ఉన్నారు. పాక్ ఉగ్రవాదులు చెప్పిన విధంగా నిందితులు తెలంగాణలోని ఆదిలాబాద్‌కు మందుగుండు సామగ్రిని తరలిస్తున్నారు. నిందితులను గుర్‌ప్రీత్, అమన్‌దీప్, పర్మిందర్, భూపిందర్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడు గుర్‌ప్రీత్‌కు ఫిరోజ్‌పుర్ జిల్లాలో డ్రోన్ ద్వారా పేలుడు పదార్థాలు అందాయి. వీరు నాందేడ్‌కు పేలుడు పదార్థాలను తరలించే సమయంలో పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయమైన వర్గాల సమాచారం మేరకు పోలీసులు వారిని బస్తారా టోల్ ప్లాజా సమీపంలో చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గరు ఫిరోజ్‌పుర్‌కు, మరొకరు లుథియానాకు చెందినవారని తెలిపారు. ఒక పిస్టల్, 31 లైవ్ క్యాట్రిడ్జ్‌లు, పేలుడు పదార్థాలతో కూడిన మూడు కంటైనర్లు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాల చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు.