కరోనా ఉద్ధృతి దృష్ట్యా బంగాల్‌లో మరో నాలుగు దశల్లో జరగనున్న ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తారనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని.. ముందుగా నిర్దేశించిన ప్రకారమే నాలుగు దశల్లో ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది.
బంగాల్‌లో ఇప్పటికే నాలుగు దశల్లో 135 స్థానాలకు ఎన్నికలు పూర్తికాగా, మిగతా 159 స్థానాలకు మరో నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సమయంలో దేశంలో కరోనా రెండో దఫా ఉద్ధృతితో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ సమయంలో బంగాల్‌లో మరో నాలుగు దశల్లో జరగాల్సిన ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తారనే ప్రచారం మొదలయ్యింది. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రస్తుతానికి అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేసింది.