నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఇందల్‌వాయి మండలం చాంద్రాయన్‌పల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఓ కారు అతివేగంతో ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఘటనలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా.. అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ముగ్గురు మహారాష్ట్ర కొండల్‌వాడి ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు గణేశ్, ఆదిత్య, మరొకరు అంకల్‌వాడి ప్రాంతానికి చెందిన ప్రకాశ్ కాగా.. ఇంకొకరు నిజామాబాద్ దుబ్బ ప్రాంతానికి చెందిన సాయిరాంగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుండి నాగ్‌పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న బాధిత కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుల్లో గణేశ్‌కు రెండేళ్ల క్రితం పెళ్లి కాగా.. ప్రస్తుతం అతడి భార్య 9 నెలల గర్భవతి. ప్రకాశ్ అనే 26 ఏళ్ల యువకుడికి మే 2న పెళ్లి నిశ్చయమైంది. మరో యువకుడు సాయిరాం నిజామాబాద్‌లో రోడ్డు నిర్మాణ గుత్తేదారు వద్ద సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులకు ఇతడు ఒక్కడే సంతానం.
ఈ నలుగురు నిజామాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లోని మొబైల్ దుకాణాలకు యాక్సెసరీస్ సప్లై చేస్తారని కుటుంబసభ్యులు తెలిపారు. వ్యాపారానికి సంబంధించిన పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లి.. తిరిగి వస్తుండగా చాంద్రాయన్‌పల్లి వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్టు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.