Road Accident: ఆగి ఉన్న బస్సును కారు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదౌన్ జిల్లా ముజారియా ప్రాంతంలో జరిగింది. వీరంతా జమల్పుర్ గ్రామానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. దిల్లీలో నివసించే వీరు హోలీ పండగ సందర్భంగా ఇంటికి ప్రయాణమయ్యారని.. ఈ క్రమంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలిపారు.
టిప్లు (50), బల్వీర్ (35) సహా మరొకరు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. చికిత్స పొందుతున్న మిగతా ఆరుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
మరో ముగ్గురు..
లఖ్‌నవూలోని కిషన్పథ్లో బుధవారం ఉదయం మరో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు.. కుషీనగర్ జిల్లాకు చెందిన నితీశ్ శర్మ, సత్యం త్రిపాఠి, ఆకాశ్ కుష్వహాగా అధికారులు గుర్తించారు. పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్‌ను గుర్తించి అరెస్ట్ చేస్తామని తెలిపారు.
హైవేపై విషాదం..
కర్ణాటకలోని విజయనగర జిల్లా బనవికల్లు సమీపాన జాతీయ రహదారిపై.. మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడటం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. ఇతరులు ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో తుదిశ్వాస విడిచినట్లు అదికారులు పేర్కొన్నారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి :ఛార్జింగ్ చేస్తుండగా మంటలు.. ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం