తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అగ్గిపెట్టెతో ఆడుకుంటూ అగ్నికి ఆహుతైన బాలుడు.. ప్రభుత్వ చిల్డ్రన్​ హోమ్​లో మరో నలుగురు చిన్నారులు.. - బిహార్ ఫుట్​బాల్ క్రీడాకారిణి

ఓ ప్రభుత్వ చిల్డ్రన్​ హోమ్​లో చికిత్స పొందుతూ నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్​లో జరిగింది. దీంతో హోమ్​ సూపరింటెండెంట్​కు అధికారులు షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. మరో ఘటనలో ఓ చిన్నారి అగ్గిపెట్టెతో ఆడుకుంటూ వెళ్లి.. పక్కనే ఉన్న గడ్డివాముకు నిప్పటించాడు. దీంతో మంటల్లో చిక్కుకుని చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హృదయవిదారక ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

Four children died
Four children died

By

Published : Feb 15, 2023, 5:43 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ ప్రభుత్వ చిల్డ్రన్స్ హోమ్​లో నలుగురు చిన్నారులు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో చిన్నారి పరిస్థితి విషమించడం వల్ల వేరొక ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారుల వయస్సు కేవలం మూడు నెలల్లోపే ఉంటుందని అధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా వీస్తున్న శీతల గాలుల నుంచి చిన్నారులను రక్షించేందుకు హోమ్​లో తగిన ఏర్పాట్లు లేనందునే వారంతా మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో చిల్డ్రన్​ హోమ్​ సూపరింటెండెంట్​కు అధికారులు షోకాజ్​ నోటీసులు జారీ చేశారు.

లఖ్​నవూ ప్రగ్​ నారాయణ రోడ్డులోని ఓ ప్రభుత్వ చిల్డ్రన్​ హోమ్​లో లక్ష్మి, దీప, ఆయుషి, అంతరా అనే నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఆ హోమ్​లో చలి నుంచి రక్షించేందుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే చిన్నారులు న్యుమోనియా బారినపడినట్లు సీఎంఓ అధికారులు గుర్తించారు. ఫిబ్రవరి 10-12 మధ్యలో హోమ్​లో చికిత్స పొందుతున్న ముగ్గురు చిన్నారు మృతి చెందినట్లు హోమ్​ నిర్వాహకులు తెలిపారు. దీంతో ప్రస్తుతం అదే హోమ్​లో చికిత్స పొందుతున్న చిన్నారులను దగ్గర్లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నందున కొందరిని సివిల్​ ఆస్పత్రిలో చేర్పించినట్లు సీఎంఎస్​ డాక్టర్​ ఆర్​పీ సింగ్ తెలిపారు.​ అక్కడ నుంచి మరో ఇద్దరిని కేజీఎంయూ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన వెల్లడించారు.

దీనిపై చిల్డ్రన్​ హోమ్​ సూపరింటెండెంట్​ కిన్షుక్​ త్రిపాఠికి డీపీఓ అధికారులు షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. గురువారంలోగా సమాధానం చెప్పాలని ఆదేశించారు. మెజిస్టీరియల్​ విచారణకు కూడా ఆదేశించారు. చిన్నారుల మృతి విషయం తెలిసి.. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్​, చైల్డ్ వెల్ఫేర్​ కమిటీ సభ్యులు హోమ్​కు చేరుకుని.. హోమ్​ నిర్వహుకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అగ్గిపెట్టెతో ఆడుకుంటూ నిప్పంటించుకుని బాలుడు మృతి..
ఛత్తీస్​గఢ్​ కొరియాలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అగ్గిపెట్టెతో ఆడుకుంటూ వెళ్లి.. పక్కనే ఉన్న గడ్డివాముకు నిప్పంటించాడు. దీంతో మంటల్లో చిక్కుకున్న ఆ బాలుడు అక్కడకికక్కడే మృతిచెందాడు. ఈ హృదయవిదారక ఘటన మంగళవారం అర్ధరాత్రి కొరియా ప్రాంతంలో జరిగింది. పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు చిన్నారి తన తల్లిదండ్రులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆ బాలుడు ఆడుకుంటూ.. పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లాడు. ఆ ఇంట్లో పశువుల మేత కోసం గడ్డిని నిల్వ ఉంచారు. అయితే అగ్గిపెట్టెతో ఆడుకుంటున్న బాలుడు.. గడ్డివాముకు నిప్పంటించాడు. దీంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో మంటలు చేలరేగాయి. చిన్నారి ఏడుపు విన్న తల్లి పరుగెత్తుకుంటూ వెళ్లి అతన్ని కాపాడింది. కానీ, అప్పటికే ఆ చిన్నారి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మహిళా క్రీడాకారిణిపై అత్యాచారయత్నం
బిహార్​లో ఓ ఫుట్​బాల్​ క్రీడాకారిణిపై అత్యాచారయత్నం జరిగింది. సివాన్​ ప్రాంతానికి చెందిన ఓ క్రీడాకారిణి తనపై అత్యాచారయత్నం జరిగిందంటూ.. జిల్లా మేజిస్ట్రేట్​ను ఫిర్యాదు చేసింది. ఎప్పటిలానే సోమవారం కూడా వాకింగ్​కు వెళ్లగా.. ఓ యువకుడు తనను బలవంతంగా పొలాల్లోకి ఈడ్చుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడంటూ ఆ ఫిర్యాదులో పేర్కొంది. తాను గట్టిగా అరవడం వల్ల.. నిందితుడు అక్కడినుంచి పరారైనట్లు వెల్లడించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 2022లో అమెరికాలో జరిగిన ఒలింపిక్ యూనిఫైడ్ క్రీడల్లో భారత్​ తరపున పాల్గొన్న ఆమె.. కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

ABOUT THE AUTHOR

...view details