బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుంటలో పడి మృతిచెందారు. మఝోలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని డుమారియా గ్రామంలో జరిగింది. కుంట పూడిక తీస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మృతులను బహువార్వా గ్రామానికి చెందిన ఈట్వరి దేవి(50), అమె మనుమరాళ్లు సరితా కుమారి(13), ఖషికుమారి(8), హంసి కుమారి(6)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీసి శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఝార్ఖండ్‌లో వేర్వేరు ఘటనల్లో ఏడుగురు చిన్నారులు: ఝార్ఖండ్ జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు చిన్నారులు మరణించారు. పలాము, హజారీబాగ్, కొడారియా, చతరా జిల్లాలో ఈ ఘటనలు జరగగా.. వీరందరూ నీటిలో మునిగిపోయి మృతిచెందారు. సత్బార్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని తాబర్ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు పక్కనే ఉన్న గ్రాఫైట్ గనుల్లో ఆడుకునేందుకు వెళ్లారు. గనుల తవ్వకాల గుంతలో స్నానానికి దిగిన పిల్లలు.. అదుపుతప్పి అందులో పడి మరణించారు. మృతులను మన్ను(13), అమన్(11), అక్మల్(10)గా గుర్తించారు.
హజారీబాగ్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మరణించారు. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెహడా డ్యామ్‌లో స్నానం చేసేందుకు దిగారు ముగ్గురు పిల్లలు. లోతు గమనించకుండా దిగడం వల్ల నీట మునిగిపోయారు. సమాచారం అందుకున్న గ్రామస్థులు.. సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికితీసి శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను అజయ్ ప్రసాద్ అనే బీఎస్ఎఫ్ జవాన్ పిల్లలుగా గుర్తించారు.