Sharad Yadav Passes Away : కేంద్ర మాజీ మంత్రి, సోషలిస్ట్ నేత, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్(75) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుభాషిణి వెల్లడించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శరద్ యాదవ్ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను గురుగ్రామ్‌లోని ఓ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 'ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. పల్స్ లేదు. మేము తొలుత సీపీఆర్ ప్రయత్నించి చూశాం. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాత్రి 10.19 గంటలకు ఆయన చనిపోయారు' అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో 1947 జులై 1న జన్మించిన శరద్ యాదవ్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1999 నుంచి 2004 మధ్య వాజ్‌పేయూ ప్రభుత్వంలో శరద్ యాదవ్ పలు మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. 2003లో జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) జాతీయ అధ్యక్షుడయ్యారు. తన రాజకీయ ప్రస్థానంలో ఏడు సార్లు లోక్ సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017లో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భాజపాతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆయనతో విభేదించి జేడీయూ నుంచి బయటకొచ్చారు. 2018లో లోక్‌తాంత్రిక్ జనతాదళ్(ఎల్‌జేడీ) పార్టీ ఏర్పాటు చేశారు. అయితే 2022 మార్చిలో ఆర్జేడీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో ప్రతిపక్షాలను ఏకం చేయడంలో ఇది తొలి అడుగని శరద్ యాదవ్ పేర్కొన్నారు. శరద్ యాదవ్ మృతితో దేశవ్యాప్తంగా పలువురు నాయకులు సంతాపం తెలిపారు.