మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కరోనా బారిన పడ్డారు. ఆయన భార్య చెన్నమ్మకు కూడా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయనే తెలిపారు. ప్రస్తుతం ఇరువురు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు దేవెగౌడ పేర్కొన్నారు. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు, తన క్షేమం కోరేవారు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
మోదీ ఆరా...
కరోనా బారిన పడిన దేవెగౌడ దంపతుల ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. వారికి ఫోన్ చేసి మాట్లాడినట్లు ట్విట్టర్లో వెల్లడించారు. ఇద్దరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
మోదీ ఫోన్ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ కాసేపటికే దేవెగౌడ ట్వీట్ చేశారు. "దేశంలో నేను కోరుకున్న ఏ నగరంలోనైనా, ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స చేయించుకోవాలని మోదీ సూచించడం ఆనందకరం. నాకు బెంగళూరులో అంతా బాగుందని, ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తానని ఆయనకు చెప్పా." అని ట్విట్టర్లో పేర్కొన్నారు మాజీ ప్రధాని.