టూల్‌కిట్ కేసులోదిశా రవి అరెస్టును విమర్శిస్తున్న వారిపై న్యాయవ్యవస్థ, పోలీసు శాఖలోని మాజీలు ధ్వజమెత్తారు. స్వార్థ ప్రయోజనాల కోసం, దేశ వ్యతిరేక భావనలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు.
లేఖ రాసిన 47 మందిలో రాజస్థాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్ వీఎస్ కోక్జే, దిల్లీ మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్, పంజాబ్ మాజీ డీజీపీ పీసీ డోగ్రా, సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర రావు, కేరళ మాజీ డీజీపీ పద్మనాభన్ ఉన్నారు.
పోలీసులకు అపవాదు..
నిరాధార ఆరోపణలతో దిల్లీ పోలీసులను అపవాదు పాలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పోలీసుల చర్యను సమర్థిస్తూ టూల్కిట్లో పేర్కొన్న వ్యక్తులు, సంఘాలకు ఐఎస్ఐ, ఖలిస్థానీ బృందంతో సంబంధం ఉన్నట్లు తేలిందని చెప్పారు.