Mandya ex MP Ramya DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్‌లో నేతల మధ్య రాజకీయ రగడ మొదలైంది. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై మండ్య మాజీ ఎంపీ రమ్య ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. తనను ట్రోల్ చేయాలని పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ నేతలు సూచించారని విమర్శించారు మాజీ ఎంపీ రమ్య. ఈ మేరకు కన్నడ, ఆంగ్ల భాషలో ఉన్న పలు స్క్రీన్షాట్లను రమ్య ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కార్యకర్తలు అంత శ్రమ తీసుకోవద్దని, తనపై తానే ట్రోల్స్ చేసుకుంటానని ఎద్దేవా చేశారు.
వివాదం మొదలైందిలా...
మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఎంబీ పాటిల్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి అశ్వత్ నారాయణ్ మధ్య జరిగిన భేటీ ఈ వివాదానికి ఆజ్యం పోసింది. పీఎస్ఐ రిక్రూట్మెంట్ స్కామ్ విషయంలో తనను తాను రక్షించుకోవడానికి పాటిల్‌తో అశ్వత్ భేటీ అయ్యారని కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆరోపించారు. వీటిని అశ్వత్, పాటిల్ ఖండించారు. అయితే, ఈ అంశంపై స్పందించిన మాజీ ఎంపీ రమ్య.. 'వేర్వేరు పార్టీల వ్యక్తులు అప్పుడప్పుడు కలుస్తుంటారు. శుభకార్యాలకూ వెళ్తారు. వేర్వేరు పార్టీల నేతల కుటుంబాల మధ్య వివాహాలూ జరుగుతుంటాయి. కాంగ్రెస్‌కు ఎంతో నమ్మకంగా ఉండే పాటిల్‌పై శివకుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరం' అని ట్వీట్ చేశారు.