తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ సీఎంలు ఇస్తున్న డబ్బులతోనే PK రాజకీయం.. సంచలన విషయాలు వెల్లడి - ప్రశాంత్ కిశోర్ బిహార్ రాజకీయం

'జన్​ సురాజ్​' పేరిట ఓ వేదికను స్థాపించి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. బిహార్‌లో 3,500 కి.మీ. పాదయాత్ర చేస్తున్నారు. అయితే.. పీకే వెనుక ఎవరు ఉన్నారు? ఆయన 'రాజకీయం' కోసం నిధులు ఎవరు ఇస్తున్నారు? అనే ప్రశ్నలు ఎప్పటి నుంచో చర్చనీయాంశమయ్యాయి. ఈ ప్రశ్నలకు స్వయంగా జవాబు ఇచ్చారు ప్రశాంత్ కిశోర్.

prashant kishor political party
ఆ సీఎంలు ఇస్తున్న డబ్బులతోనే PK రాజకీయం.. సంచలన విషయాలు వెల్లడి

By

Published : Oct 26, 2022, 6:12 PM IST

బిహార్​లో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ నెలకొల్పడమే ధ్యేయంగా చేపట్టిన జన్​ సురాజ్​ ఉద్యమానికి తన మాజీ క్లయింట్లు ఆర్థిక సాయం చేస్తున్నారని పరోక్షంగా వెల్లడించారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. రాజకీయ సలహాదారుగా పని చేసేందుకు తాను స్థాపించిన ఐప్యాక్​ నుంచి గతంలో సేవలు పొందిన వారు ఇప్పుడు తనకు అండగా ఉంటున్నారని సంకేతాలిచ్చారు. వారిలో ఆరుగురు ప్రస్తుతం ముఖ్యమంత్రులుగా ఉన్నారని స్పష్టం చేశారు.

బిహార్​లోని ప్రతి ప్రాంతాన్ని చుట్టొచ్చేలా 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న ప్రశాంత్ కిశోర్.. నేపాల్​ సరిహద్దుల్లోని వాల్మీకి నగర్​లో ప్రెస్​ మీట్​లో ఈ విషయం వెల్లడించారు. పీకేకు భాజపా ఆర్థిక వనరులు సమకూరుస్తూ ఉండొచ్చని జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో జన్​ సురాజ్ అధినేత స్పష్టత ఇచ్చారు.

"గత దశాబ్ద కాలంలో నేను కనీసం 10 ఎన్నికల కోసం వేర్వేరు పార్టీలకు సేవలు అందించాను. ఒక్కటి మినహా అన్ని ఎన్నికల్లోనూ సఫలం అయ్యాను. నా సాయంతో గెలిచిన వారిలో ఆరుగురు ప్రస్తుతం ముఖ్యమంత్రులు. అప్పుడు నేను వారి దగ్గర డబ్బులు తీసుకోలేదు. మీడియా ఈ మాట నమ్మకపోవచ్చు. బిహార్​లో చేస్తున్న ఈ ప్రయోగం కోసం ఇప్పుడు నేను వారి సాయం తీసుకుంటున్నా.

కానీ.. బిహార్​లో మాత్రం నేను ఎవరి నుంచీ రూపాయి కూడా తీసుకోలేదు. హెలికాప్టర్లు, భారీ సభా వేదికలు, ప్రకటనలు, జన సమీకరణ వంటివాటికి ఖర్చులు చేయకుండానే మా పాదయాత్ర సాగుతోంది. మేము ఇంకా రాజకీయ పార్టీగా అవతరించలేదు. అదే జరిగితే.. బిహార్​లోని రెండు కోట్ల కుటుంబాలు రూ.100 చొప్పున విరాళం ఇచ్చినా మాకు చాలు." అని చెప్పారు ప్రశాంత్ కిశోర్. బిహార్​లో ఇప్పటికే ఉన్న పార్టీలతో జట్టుకట్టే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

ఇండియన్ పొలిటికల్ యాక్షన్​ లీగ్​(ఐప్యాక్​) పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసి, రాజకీయ పార్టీలకు ఎన్నికల వ్యూహాలు రచించేవారు పీకే. 2014లో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార ప్రణాళికను రూపొందించారు. నాటి ఎన్నికల్లో భాజపా ప్రభంజన విజయంతో పీకే పేరు దేశమంతా మార్మోగిపోయింది. తర్వాత అనేక రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలకు ఆయన పనిచేశారు. ఇలా మొత్తం 10 ఎన్నికల కోసం వ్యూహాలు రచించగా.. 2017 ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో మాత్రమే ఆయనకు ప్రతికూల ఫలితం ఎదురైంది. కాంగ్రెస్​ కోసం ఆయన పనిచేసినా.. ఆ పార్టీ ఓడిపోయింది. తన సలహాల్ని కాంగ్రెస్ నేతలు విస్మరించారన్నది పీకే వాదన.

ప్రస్తుత దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​ మోహన్ రెడ్డి, బంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్.. పీకే సేవలు పొందినవారే. గతేడాది బంగాల్​లో టీఎంసీ విజయం తర్వాత.. పొలిటికల్ కన్సల్టెంట్​గా రిటైర్​మెంట్​ ప్రకటించారు పీకే. జన్​ సురాజ్​ పేరుతో బిహార్ రాజకీయాల్లోకి దిగారు.

ABOUT THE AUTHOR

...view details