తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీం నోట పదేపదే శేషన్‌.. విశేషన్​.. సెన్సేషన్‌.. ఎవరాయన?

TN Seshan Biography : టి.ఎన్‌.శేషన్‌లాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్లు ఎన్నికల కమిషన​ర్​​గా రావాలి.. అని సుప్రీంకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. శేషన్‌లాంటివాళ్లు ఎప్పుడో ఒకసారిగాని కన్పించరని ఎన్నికల నియామకాలపై విచారణ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో టి.ఎన్​.శేషన్ గొప్పతనం గురించి ఓ సారి తెలుసుకుందాం.

tn seshan biography
టీఎన్ శేషన్

By

Published : Nov 25, 2022, 6:31 AM IST

TN Seshan Biography : "శేషన్‌లాంటివాళ్లు ఎప్పుడో ఒకసారిగాని కన్పించరు! శేషన్‌లాంటి వ్యక్తిత్వంగలవాళ్లు ఎన్నికల కమిషనర్‌గా రావాలి!".. ఎన్నికల కమిషనర్‌ నియామకాలపై విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం నోట పదేపదే వినిపించిన పేరిది! ఇంతకూ సుప్రీంకోర్టు పలవరిస్తున్న శేషన్‌ ఎవరు? ఏంటాయన గొప్పతనం?

తిరునెల్లై నారాయణ అయ్యర్‌ శేషన్‌.. టి.ఎన్‌.శేషన్‌.. ప్రస్తుత మిలీనియల్‌, జెనీలియల్‌ తరానికి పెద్దగా పరిచయం లేని పేరిది! కానీ 90ల్లో దేశ రాజకీయాలను ఓ ఊపుఊపిన పేరు.. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను నిక్కచ్చిగా ఉపయోగించి రాజకీయ పార్టీలు, నాయకులను గడగడలాడించిన తీరు.. నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తే చాలు అనేక సంస్కరణలు తీసుకు రావొచ్చని నిరూపించినవారు.. టి.ఎన్‌.శేషన్‌! సంస్కరణలతో పాటు అనేక సంచలనాలు.. వివాదాల విశేషన్‌.. శేషన్‌. మన రాజ్యాంగం దేశ ఎన్నికల కమిషన్‌పై గురుతర బాధ్యత పెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని కాపాడే క్రమంలో బాధ్యతలను నిర్వర్తించడానికి ఎన్నో అధికారాలనూ ఇచ్చింది. కానీ 1990 దాకా ఈ బాధ్యత చేపట్టిన వారిలో చాలామంది అధికార పార్టీకి అనుగుణంగా నడుచుకున్నవారు.. లేదంటే మౌన ప్రేక్షకులుగా నిలిచిపోయినవారే! కానీ 1990 డిసెంబరు 12న ఆ పరిస్థితి మారిపోయింది. కారణం- ఆరోజు టి.ఎన్‌.శేషన్‌ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా బాధ్యతలు చేపట్టడమే! 1996 డిసెంబరు 11న తన పదవీకాలం ముగిసే దాకా శేషన్‌ మన రాజ్యాంగానికున్న బలమేంటో చూపించారు.

కేరళలోని పాలక్కడ్‌ జిల్లాలో 1932 డిసెంబరు 15న జన్మించిన శేషన్‌ మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీలో చదివి అక్కడే పాఠాలు చెప్పారు. పోలీసు సర్వీస్‌కు ఎంపికైనా చేరకుండా, 1954లో సివిల్స్‌లో విజయం సాధించి తమిళనాడు కేడర్‌ ఐఏఎస్‌ అధికారి అయ్యారు. కలెక్టర్‌గా ఉంటూనే హార్వర్డ్‌లో మాస్టర్స్‌ పూర్తిచేశారు.

తమిళనాడు నుంచి కేంద్ర సర్వీసుల్లోకి వచ్చిన శేషన్‌.. అనేక శాఖల్లో కీలక పాత్ర పోషించారు. 1985-88 మధ్య అడవులు, పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా తెహ్రీ, సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టులను వ్యతిరేంచారు. కానీ ఆయన మాట చెల్లుబాటు కాలేదు. 1989లో సివిల్‌ సర్వెంట్లకు అత్యున్నత పదవిగా భావించే భారత కేబినెట్‌ కార్యదర్శిగా యమితులయ్యారు. ప్రణాళిక సంఘం సభ్యుడిగానూ కొనసాగారు. అనంతరం 1990లో శేషన్‌ను కేంద్రం ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా నియమించింది. అప్పటి న్యాయశాఖ మంత్రి సుబ్రమణ్య స్వామి ఈ విషయంలో కీలకపాత్ర పోషించారంటారు!

విరమణ తర్వాత..

  • ఎన్నికల సంస్కరణలకుగాను రామన్‌ మెగసెసె అవార్డు అందుకున్న శేషన్‌.. సీఈసీగా పదవీ విరమణ చేశాక రాజకీయ ప్రవేశం చేశారు. 1997లో రాష్ట్రపతి ఎన్నికల్లో కె.ఆర్‌.నారాయణన్‌పైౖ పోటీ చేసి ఓడిపోయారు.
  • 1999లో గాంధీనగర్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ టికెట్‌పై భాజపా నేత ఎల్‌.కె.అడ్వాణీని ఢీకొని పరాజయం పాలయ్యారు.
  • ఆ తర్వాత శేష జీవితాన్ని భార్య జయలక్ష్మితో కలసి చెన్నైలోని ఆశ్రమంలో గడిపారు. వీరికి పిల్లలు లేరు. శేషన్‌ 2019 నవంబరు 10న చెన్నైలో కన్నుమూశారు.

పని రాక్షసుడు..
పనిరాక్షసుడిగా పేరొందిన శేషన్‌.. తన పనిని పూర్తి చేయటానికి, పనిని అర్థం చేసుకోవటానికి ఏమాత్రం మొహమాటపడేవారు కాదు. చెన్నై ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పనిచేసినప్పుడు.. సమస్యలను అర్థం చేసుకోవటానికి తానే డ్రైవర్‌గా మారి ప్యాసింజర్‌ బస్సులు నడిపారు.

గడగడలాడిన పార్టీలు..

ఐఏఎస్‌గా రాజకీయ పరిమితులను ఎదుర్కొన్న శేషన్‌.. రాజ్యాంగబద్ధమైన సీఈసీగా బాధ్యత చేపట్టగానే విశ్వరూపం ప్రదర్శించటం ఆరంభించారు. సీఈసీగా శేషన్‌ రాజ్యాంగమిచ్చిన అధికారాలను ఉపయోగించి ఎన్నికల నిర్వహణలో ఉన్న 150 లోపాలను గుర్తించి కత్తెర వేశారు. అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

ఇదీ ఆయన మార్కు..

  • ఎన్నికల నిబంధనావళి కచ్చితంగా అమలు.
  • ఓటర్‌ ఐడీ కార్డుల జారీ
  • గోడలపై రాతలు బంద్‌
  • అభ్యర్థుల ఖర్చుకు పరిమితులు విధించటం
  • మతపరమైన స్థలాల్లో ఎన్నికల ప్రచారంపై నిషేధం
  • ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి పరిశీలకులను నియమించటం
  • ప్రచారానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడటంపై నిషేధం
  • అనుమతి లేకుండా మైకుల వాడకంపై నిషేధం
  • సంస్థాగత ఎన్నికలు జరపని పార్టీల గుర్తింపు రద్దు చేస్తానని హెచ్చరిక
  • శేషన్‌ తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా 1999 సార్వత్రిక ఎన్నికల్లో తప్పుడు లెక్కలు చూపించిన కారణంగా దాదాపు 1500 మంది అభ్యర్థులపై మూడేళ్లపాటు వేటు పడింది.

మంత్రులను తొలగించాలంటూ.. ప్రధానికే డిస్మిస్‌ సిఫార్సు చేసిన శేషన్‌..
ప్రధానమంత్రి తప్పుడు నిర్ణయంపై చర్య తీసుకోగల ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) కావాలి.. అంటూ సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. టి.ఎన్‌. శేషన్‌ హయాంలో అలాంటి సంఘటనే జరిగింది.

  • పీవీ నరసింహారావు హయాంలో ఆయన మంత్రివర్గ సభ్యులు సీతారాం కేసరి, కల్పనాథ్‌ రాయ్‌లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ.. వారిని కేబినెట్‌ నుంచి తొలగించాలని శేషన్‌ ఏకంగా ప్రధానికి సిఫార్సు చేశారు. దీనిపై దుమారం రేగింది. శేషన్‌ తన పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారంటూ.. ఆయన్ను పార్లమెంటులో అభిశంసించాలనే డిమాండ్‌ తలెత్తింది.
  • అదంతా కానిపని అని తెలిసిన పీవీ చాకచక్యంగా మరో ఇద్దరు (ఎం.ఎస్‌.గిల్‌, జీవీజీ కృష్ణమూర్తి) ఎన్నికల కమిషనర్లను నియమించి శేషన్‌కు ముకుతాడు వేసే ప్రయత్నం చేశారు.
  • ఆ ఇద్దరు కమిషనర్లను గాడిదలుగా అభివర్ణించిన శేషన్‌ వారిని కార్యాలయంలోకి రాకుండా అడ్డుకున్నారు. వీరి నియామకాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కానీ ఎన్నికల కమిషన్‌ బహుళ సభ్య సంస్థగా ఉండాలన్న రాజ్యాంగ నిబంధనలను ఎత్తి చూపుతూ సుప్రీంకోర్టు శేషన్‌ పిటిషన్‌ను కొట్టేసింది.

ABOUT THE AUTHOR

...view details