సాధారణంగా రాజకీయ నాయకులు తీరిక లేకుండా గడుపుతారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే మాత్రం ఐదు పదుల వయసులోనూ చదువుపై ఆసక్తి కనబరిచారు. ఆయనే భాజపా మాజీ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా. 12వ తరగతి పరీక్షలు రాసేందుకు విద్యార్థులతో కలిసి ఎగ్జామ్ హాల్‌కు వచ్చారు. సాదాసీదా వ్యక్తిలా ప్యాడ్, మరో చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని సింపుల్‌గా పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. దీంతో విద్యార్థులందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడేం జరిగిందంటే?
రాజేశ్ మిశ్రా(51) ఫిబ్రవరి 16న.. 12వ తరగతి పరీక్షలు రాయడానికి పరీక్షా కేంద్రానికి వెళ్లారు. 'లా' చదవాలనే ఆసక్తితో 51 ఏళ్ల వయసులో 12వ తరగతి పరీక్షలు రాస్తున్నానని ఆయన తెలిపారు. మంచి రాజకీయ నాయకుడిగా చురుగ్గా ఉంటూనే 12వ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తానని తెలిపారు రాజేశ్. ఆయన 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరేలీలోని బిత్రి చైన్‌పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పార్టీ అధిష్ఠానం టికెట్ నిరాకరించింది. అయితే ఆయన అప్పటి నుంచి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో రాజకీయాలతో పాటు చదువును కొనసాగించాలని మిశ్రా నిర్ణయించుకున్నారు. అయితే 51 ఏళ్ల వయసులో పరీక్షలు రాయటం వల్ల చిన్నవయసు వారిని కలిసే అవకాశం ఉంటుందని మిశ్రా అభిప్రాయపడ్డారు. 12వ తరగతి పరీక్షలు రాసిన రాజేశ్ మిశ్రాకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ముగ్గురు పిల్లలు ఉన్నారు.