బక్కపలచటి శరీరం, మాసిన దుస్తులు, చేతిలో పాత సంచితో ఓ మహిళ బంగాల్లోని రోడ్లపై యాచిస్తున్నారు. ఫూట్పాత్లపైనే నిద్రిస్తున్నారు. వీధివీధి తిరిగి భిక్షాటన చేస్తూ.. బతుకును వెల్లదీస్తున్నారు. ఈమె బంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య మరదలు.
34 ఏళ్లపాటు టీచర్‌గా..
బంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య భార్య మీరా భట్టాచార్య.. సోదరి ఇరా బసు. ఆమె వైరాలజీ విభాగంలో పీహెచ్డీ చేశారు. ఇరా.. ఇంగ్లీష్, బెంగాలీ క్షుణ్ణంగా మాట్లాడతారు. ఆమె గతంలో రాష్ట్ర స్థాయి అథ్లెట్ కూడా. బంగాల్.. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ప్రియానాథ్ బాలికల పాఠశాలలో ఇరా బసు.. లైఫ్ సైన్సెస్ విభాగంలో 1976 నుంచి 2009లో పదవీ విరమణ పొందేవరకూ అధ్యాపకురాలిగా పనిచేశారు.
వీధుల్లో యాచిస్తున్న ఇరాబసు గతంలో బారానగర్‌లో నివాసం ఉన్నారు ఇరా. ఆ తర్వాత కొంతకాలానికి కోల్‌కతా దన్లోప్ ప్రాంతంలోని రోడ్లపై దర్శనమిచ్చారు. ఆమె పదవీవిరమణ తర్వాత.. పింఛను కోసం ధ్రువపత్రాలను అందించాలని ఇరాను కోరామని.. అయితే ఆమె ఎలాంటి సర్టిఫికెట్లు ఇవ్వలేదని.. దీంతో ఆమెకు పింఛను కూడా రావటంలేదని ప్రియనాథ్ స్కూల్ హెడ్ మాస్టర్ కృష్ణకలి చందా తెలిపారు.
సెప్టెంబర్ 5.. అధ్యాపకుల దినోత్సవం సందర్భంగా.. గతంలో ఆమె పనిచేసిన ప్రియనాథ్ స్కూల్ యాజమాన్యం.. ఆమెను సత్కరించారు. ఇప్పటికీ అందరు టీచర్లు తనను అభిమానిస్తున్నారని, తన విద్యార్థులు గుర్తుపడుతున్నారని ఇరా చెప్పుకొచ్చారు. తనకు వీఐపీ గుర్తింపు అవసరంలేదన్నారు.
ఇరాబసు వార్త.. నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అధికారులు ఆమెను కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు.
ఇదీ చదవండి:భవానీపుర్ స్థానానికి బంగాల్ సీఎం నామినేషన్