నందిగ్రామ్... ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది హింస, రక్తపాతం. బంగాల్లోని ఈ ప్రాంతంలో దశాబ్దం క్రితం జరిగిన అల్లర్లే ఇందుకు కారణం. ఆ తర్వాత పరిస్థితులు మారి ఆ ప్రాంతానికున్న ప్రాముఖ్యం తగ్గింది. కానీ బంగాల్ శాసనసభ ఎన్నికల వేళ ఇప్పుడు నందిగ్రామ్ మళ్లీ తెరపైకి వచ్చింది. అందుకు కారణం బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమెకు గతంలో అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొంది ఇటీవలే భాజపా తీర్థం పుచ్చుకున్న సువేందు అధికారి.
ఇంతకీ... నందిగ్రామ్ ప్రజల ఓటు ఎవరికి?
2007 ఘర్షణతో..
నందిగ్రామ్ ప్రస్తావన వస్తే... ముందుగా 2007లో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకోవాలి. ఆ ప్రాంతాన్ని కెమికల్ హబ్‌గా మార్చేందుకు నిర్ణయించిన నాటి వామపక్ష ప్రభుత్వం.. రైతుల నుంచి భారీ మొత్తంలో భూములను తీసుకునేందుకు ప్రణాళికలు రచించింది. ఇందుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఒకానొక సందర్భంలో రైతులు-పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగి అనేకమంది మరణించారు. చివరకు ప్రభుత్వం దిగొచ్చి తన ప్రణాళికను విరమించుకుంది.
ఇదీ చూడండి:-బంగాల్ గడ్డ మీద తృణమూల్‌కు భాజపా 'సవాల్'
కానీ అప్పటికే పరిస్థితి చెయ్యిదాటిపోయింది. ఉద్యమాన్ని సమర్థంగా నడిపించిన మమతా బెనర్జీకి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇదే వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చి టీఎంసీని అధికారంలో నిలబెట్టేందుకు ఉపయోగపడింది.
ఇందులో సువేందు అధికారిదీ కీలకపాత్రే. మమత వ్యూహరచనలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసిన సువేందు.. టీఎంసీ విజయానికి దోహదపడ్డారు. అనంతరం నందిగ్రామ్ నుంచే అసెంబ్లీకి ఎన్నికై ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.
చీలిక...
2007లో సంచలనాలకు కేంద్రంగా మారిన నందిగ్రామ్.. క్రమక్రమంగా చీకటిలోకి జారిపోయింది. ఆ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదు. మమత- సువేందు మధ్య శతృత్వంతో ఇన్నేళ్లకు ఈ పేరు మళ్లీ మారుమోగిపోతోంది.
ఇదీ చూడండి:-బంగాల్ బరి: 'నందిగ్రామ్' వ్యూహంతో ఎవరికి లాభం?
అంతేకాకుండా.. టీఎంసీ కంచుకోట అయిన నందిగ్రామ్ రెండుగా చీలిపోయింది. సువేందు అధికారి భాజపాలో చేరడం వల్ల ఆయన మద్దతుదారులు, అనేక మంది కార్యకర్తలు టీఎంసీ జెండాను వీడి కాషాయ కండువా కప్పుకున్నారు.
ఎన్నికల మాటేంటి?
ఈ క్రమంలో సువేందుపై గురిపెట్టిన దీదీ.. బంగాల్ ఎన్నికల పోరులో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే సువేందు కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారా? లేదా? అన్న విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.
కానీ తాను మాత్రం వెనకడువేయనని.. నందిగ్రామ్ నుంచే పోటీ చేసి మమతపై భారీస్థాయిలో విజయం సాధిస్తానని తేల్చిచెప్పారు సువేందు. ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలను వీడతానని ప్రతిజ్ఞ చేశారు. దీంతో నందిగ్రామ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.