TIGER CUBS: పులి పిల్లలను.. తిరిగి తల్లి వద్దకు చేర్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం.. సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఈనెల 6వ తేదీన 4 పులి పిల్లలు లభ్యమయ్యాయి. వీటిని తల్లి వద్దకు చేర్చేందుకు నిర్ణయించిన అధికారులు.. పులి జాడ కోసం తీవ్రంగా అన్వేషించారు.
ఆత్మకూరు, కొత్తపల్లి మండలాల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో పులి జాడ కోసం 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 3 వందల మంది సిబ్బందితో గాలింపు చేపట్టారు. కొత్తపల్లి మండలం ముసలిమడుగు సమీపంలో పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో.. పాదముద్రలను అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలోనే తల్లి పులితో పిల్లలను కలిపేందుకు రెండుసార్లు యత్నించి విఫలమయ్యారు.
తిరుపతి జూ కు తరలింపు: పులి కోసం చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో 4 పులి పిల్లలను తిరుపతి జూ పార్కుకు తరలించారు. ఆత్మకూరు నుంచి వీటిని ప్రత్యేక వాహనంలో నలుగురు వైద్యుల పర్యవేక్షణలో తిరుపతికి తరలించారు. నాలుగు ఆడ పులిపిల్లల ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటిని రెండేళ్ల పాటు జూలో సంరక్షించి.. అనంతరం నల్లమల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. మనుషులు ముట్టుకున్నారన్న కారణంతో పిల్లల వద్దకు వచ్చేందుకు పులి తల్లి ఇష్టపడటం లేదని తాము భావిస్తున్నామన్నారు. అధికారుల యత్నాలు ఫలించక పోవడంతో.. తల్లి వద్దకు పులి పిల్లలు వెళ్లే అవకాశం లేకుండా పోయింది.