విదేశీ టీకాల అత్యవసర వినియోగానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకున్న 3 పని దినాల్లోనే అనుమతులపై నిర్ణయం తీసుకోనుంది భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ). అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ఈ నిర్ణయంతో విదేశీ నియంత్రణ సంస్థల అనుమతులు పొందిన టీకాలు భారత్‌లో అడుగుపెట్టడం మరింత సులభంగా మారుతుంది.
'నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మిన్‌స్ట్రేషన్' సిఫార్సు మేరకు టీకాల అత్యవసర అనుమతులను వేగవంతంగా పరిశీలించేందుకు అవసరమైన మార్గదర్శకాలను డీసీజీఐ నేతృత్వంలోని కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ(సీడీఎస్సీఓ) తయారు చేసి వెబ్‌సైట్‌లో ఉంచనుంది.