తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Supreme Court Judges: సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు - సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 9 మంది జడ్జిలు(Supreme Court Judges) ప్రమాణస్వీకారం చేశారు. సర్వోన్నత న్యాయస్థానంలో ఇంతమంది జడ్జిలు ఒకేసారి బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ వీరితో ప్రమాణం చేయించారు.

for the first time in the history of the Supreme Court of India nine judges take Oath of Office in one go
సుప్రీంకోర్టులో ఒకేసారి 9 మంది న్యాయమూర్తుల ప్రమాణం

By

Published : Aug 31, 2021, 11:01 AM IST

Updated : Aug 31, 2021, 5:02 PM IST

సుప్రీంకోర్టులో కొత్త న్యాయమూర్తుల ప్రమాణం

సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారి 9 మంది న్యాయమూర్తులు(Supreme Court Judges) ఒకేసారి ప్రమాణస్వీకారం చేశారు. సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ వీరితో ప్రమాణం చేయించారు. సుప్రీం అదనపు భవనం ఆడిటోరియంలో మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. సీజేఐ(CJI Justice NV Ramana) సహా 9 మంది కొత్త న్యాయమూర్తులతో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య 33కు చేరింది.

సుప్రీంకోర్టులో కొత్త న్యాయమూర్తుల ప్రమాణం
సుప్రీంకోర్టులో కొత్త న్యాయమూర్తుల ప్రమాణం
సుప్రీంకోర్టులో కొత్త న్యాయమూర్తుల ప్రమాణం

సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ నిర్ణయం మేరకు గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి సుప్రీం జడ్జిల ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. సంప్రదాయంగా అయితే సీజేఐ కోర్టు(Supreme Court) రూమ్​లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ కరోనా దృష్య్టా ఈసారి ఆడిటోరియంలో నిర్వహించారు.

సుప్రీంకోర్టులో కొత్త న్యాయమూర్తుల ప్రమాణం
సుప్రీంకోర్టులో కొత్త న్యాయమూర్తుల ప్రమాణం

కొత్త జడ్జిలు వీరే..

సుప్రీం కొత్త న్యాయమూర్తులు
సుప్రీం కొత్త న్యాయమూర్తులు

జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ నాగరత్న, జస్టిస్ రవికుమార్, జస్టిస్ సుందరేశ్‌, జస్టిస్ మాధుర్య త్రివేది, జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు. సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ నేతృత్వంలోని సుప్రీం కొలీజియం వీరి పేర్లను ఆగస్టు 17న కేంద్రానికి సిఫారుసు చేసింది. ఈ ప్రతిపాదనకు ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.

సుప్రీం కొత్త న్యాయమూర్తులు

ముగ్గురు మహిళా న్యాయమూర్తులు..

ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ముగ్గురు హైకోర్టు మహిళా న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించింది సుప్రీం కొలీజియం(Supreme Court Collegium. ఇందులో ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ బి.వి.నాగరత్న 2027లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి దేశంలో ఆ స్థానానికి ఎదిగిన తొలి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. ఆమె కాకుండా ప్రస్తుతం గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, సుప్రీంకోర్టులో ఇప్పటివరకు సీనియర్‌ న్యాయవాదిగా ఉన్న తెలుగు వ్యక్తి జస్టిస్ పి.ఎస్‌.నరసింహ కూడా భవిష్యత్తులో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం సీనియారిటీ పరంగా 19వ స్థానంలో ఉన్న జస్టిస్‌ సూర్యకాంత్‌ 2025 నవంబర్‌ 24వ తేదీ నుంచి 2027 ఫిబ్రవరి 9వరకు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. ఆ తర్వాత ప్రస్తుతం పదోన్నతి వరుసలో ఉన్న గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ఆ ఏడాది సెప్టెంబర్‌ 23 వరకు సీజేఐగా బాధ్యతలు చేపడతారు. అనంతరం సెప్టెంబర్‌ 24 నుంచి అక్టోబర్‌ 30వ తేదీ వరకు జస్టిస్‌ నాగరత్న ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. వీరి తర్వాతి వరుసలో పి.ఎస్‌. నరసింహ ఆ స్థానంలోకి వస్తారు.

తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉన్నవారు..

ప్రమాణస్వీకారం చేసిన సుప్రీం కోత్త జడ్జిలలో తెలంగాణ హైకోర్టుకు ప్రాతినిధ్యం వహించిన జస్టిస్‌ హిమా కోహ్లి ఒకరు. మరొకరు జస్టిస్‌ జె.కె. మహేశ్వరి. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా 2019 అక్టోబర్‌ 7 నుంచి 2021 జనవరి 5వరకు పనిచేశారు. జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. దీంతో తెలుగు రాష్ట్రాలతో పరిచయమున్న వ్యక్తులు ముగ్గురు సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందినట్లయింది. జస్టిస్ నరసింహ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడితే జస్టిస్‌ కోకా సుబ్బారావు, జస్టిస్‌ రమణ తర్వాత ఆ ఉన్నత శిఖరానికి చేరిన మూడో తెలుగు వ్యక్తిగా చరిత్రపుటల్లోకి ఎక్కుతారు. కొలీజియం సిఫార్సు చేసిన 9 మందిలో నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కాగా, మరో నలుగురు న్యాయమూర్తులు. ఒకరు సుప్రీంకోర్టు న్యాయవాది.

పెద్ద బాధ్యత..

జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ

సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవి అన్నది పెద్ద బాధ్యతని, దీన్ని దేశం కోసం స్వీకరిస్తున్నానని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగువారు జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ 'ఈనాడు'తో పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన తండ్రి జస్టిస్‌ పి.కోదండరామయ్య నుంచి న్యాయ వారసత్వాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 1963 మే 3న ఆయన జన్మించారు. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా మోదేపల్లి. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో బీఏ చదివారు. దిల్లీ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌బీ చేశారు. 2014 నుంచి 2018 వరకు అదనపు సొలిసిటర్‌ జనరల్‌గానూ సేవలందించారు. ఇప్పుడున్న సీనియారిటీ ప్రకారం ఆయన 2027 అక్టోబరులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి 2028 మే వరకు కొనసాగే అవకాశాలున్నాయి. న్యాయవాద వృత్తి నుంచి నేరుగా న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడుతున్న తొమ్మిదో వ్యక్తిగా ఆయన చరిత్ర పుటల్లోకి ఎక్కుతున్నారు. కేరళలో మత్స్యకారులపై కాల్పులు జరిపిన ఇటాలియన్‌ మెరైన్‌ కేసు, క్రిమినల్‌ డిఫమేషన్‌కు ఉన్న రాజ్యాంగబద్ధత, న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ఎన్‌జేఏసీ కేసుల్లో, రామజన్మభూమి కేసులో రామ్‌లల్లా విరాజ్‌మాన్‌ తరఫున మహంత్‌ రామచంద్ర దాస్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ న్యాయవాదిగా వాదనలు వినిపించారు.

జస్టిస్‌ నాగరత్నదీ న్యాయ నేపథ్యమే

జస్టిస్‌ నాగరత్న న్యాయమూర్తి కుటుంబానికి చెందిన వారు. ఆమె తండ్రి జస్టిస్‌ ఇ.ఎస్‌. వెంకట్రామయ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 1987 అక్టోబరు 28న బెంగళూరులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న ఆమె రాజ్యాంగం, వాణిజ్యం, బీమా, ఉద్యోగ వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లో ప్రాక్టీసు చేశారు. 2008 ఫిబ్రవరి 18న కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 ఫిబ్రవరి 17న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. ఆమె ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడితే తండ్రి, కుమార్తెలు ఇద్దరూ అత్యున్నత పదవి పొందిన అరుదైన రికార్డును సాధిస్తారు. ఫ్లాష్‌ న్యూస్‌ పేరిట వస్తున్న అసత్య వార్తలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని 2012లో తీర్పు ఇచ్చారు. ఆలయాలు అనేవి వాణిజ్య సంస్థలు కావంటూ 2019లో ఇంకో కీలక తీర్పు వెలువరించారు. సమగ్రంగా వాదనలు విని, వేగంగా తీర్పు ఇస్తారన్న పేరు ఉంది.

ఇంతవరకు జడ్జిలుగా 8 మంది మహిళలే

ఇంతవరకు సుప్రీంకోర్టులో కేవలం ఎనిమిది మంది మహిళలు మాత్రమే న్యాయమూర్తులుగా పనిచేశారు. 1989లో జస్టిస్‌ ఎం.ఫాతిమా బీవి తొలిసారిగా న్యాయమూర్తి పదవి చేపట్టారు. అనంతరం జస్టిస్‌ సుజాతా వసంత మనోహర్‌, జస్టిస్‌ రుమా పాల్‌, జస్టిస్‌ జ్ఞాన్‌ సుధ మిశ్ర, జస్టిస్‌ రంజనా దేశాయి, జస్టిస్‌ ఆర్‌. భానుమతి, జస్టిస్‌ ఇందు మల్హోత్రా, జస్టిస్‌ ఇందిరా బెనర్జీలు న్యాయమూర్తులయ్యారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న జస్టిస్‌ ఇందిరా బెనర్జీ వచ్చే ఏడాది సెప్టెంబరు 23 వరకు కొనసాగనున్నారు.

న్యాయమూర్తులైన న్యాయవాదులు

సుప్రీంకోర్టుకు చెందిన 9 మంది న్యాయవాదులు ఇంతవరకు నేరుగా న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. తొలిసారిగా 1964లో ఎస్‌.ఎం.సిక్రి ఈ ఘనతను పొందారు. 1971లో ఆయన ప్రధాన న్యాయమూర్తి కావడం విశేషం. 1971లో జస్టిస్‌ సుబిమల్‌ చంద్ర రాయ్‌, 1988లో జస్టిస్‌ కులదీప్‌ సింగ్‌లు న్యాయమూర్తులయ్యారు. 1993లో కొలీజియం విధానంలో అమల్లోకి వచ్చిన తరువాత అయిదుగురు న్యాయవాదులు ఈ గౌరవాన్ని పొందారు. జస్టిస్‌ ఎన్‌.సంతోష్‌ హెగ్డే (1999-2005), జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌ (2014-2021), జస్టిస్‌ యు.యు.లలిత్‌ (2014), ఎల్‌.నాగేశ్వరరావు (2017), ఇందూ మల్హోత్రా (2018-2021) ఈ పదవిని అధిష్ఠించారు. వీరిలో యు.యు.లలిత్‌ ప్రధాన న్యాయమూర్తి కానున్నారు. ఈ జాబితాలో తాజాగా ఆర్‌.ఎన్‌.నరసింహ చేరారు.

సుప్రీం కొత్త న్యాయమూర్తులు

ఇదీ చదవండి:తొలి మహిళా సీజేఐగా ఆ న్యాయమూర్తికే అవకాశం?

Last Updated : Aug 31, 2021, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details